రాష్ట్ర వ్యాప్తంగా 150 వరకు వృత్తి విద్యా కళాశాలలకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ గ్రామ/వార్డు సచివాలయాల్లో పోస్టులను భర్తీ చేస్తుండటంతో ఇంటర్ వృత్తి విద్యా కోర్సులకు డిమాండ్ ఏర్పడింది. పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు ఇంటర్‌లోని లైవ్ స్టాక్ మేనేజ్‌మెంట్, డెయిరీయింగ్‌కు అర్హత కల్పించారు. ఏఎన్‌ఎం పోస్టులకు ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుకు అనుమతి ఉంది. కరోనా సమయంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు డిమాండ్ పెరగడంతో ఎంఎల్‌టీ కోర్సుకూ మళ్లీ డిమాండ్ వచ్చింది. దీంతో కొత్త కళాశాలలు, కోర్సులకు యాజమాన్యాలు దరఖాస్తులు చేశాయి. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసమంటూ కొన్నిచోట్ల పాతికేళ్లు పైబడినవారూ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నారు. వేరే ఉద్యోగాలు చేస్తున్నవారూ ప్రవేశాలు పొందారు.
డీడీల్లోనూ గోల్‌మాల్
కొత్త కళాశాలలు, కోర్సుల అనుమతులకు చెల్లించాల్సిన ఫీజుల డీడీల్లోనూ గోల్‌మాల్ జరిగింది. ఒకే డీడీపై రెండు, మూడు కోర్సులకు అనుమతులు మంజూరు చేశారు. ఒక కోర్సుకు కట్టిన డీడీనే మిగతా వాటికి కట్టినట్లు లెక్కల్లో చూపి, ఇంటర్ విద్యామండలి ఆదాయానికి గండికొట్టారు. ఇలా రూ.6 లక్షలకు పైగా నిధులను అధికారులు జేబుల్లో వేసుకున్నారు.
ఇష్టారాజ్యంగా అనుమతులు
వృత్తి విద్యా కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఇటీవల ఇంటర్ విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఇదే అదనుగా కొంతమంది అధికారులు అక్రమాలకు తెర తీశారు. యాజమాన్యాలతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా అనుమతులు మంజూరు చేశారు.
* ప్రకాశం జిల్లాలో ఓ కళాశాల యజమాని అసలు కళాశాల లేకుండానే తప్పుడు ఫొటోలతో అనుమతి పొందారు. స్థానికంగా ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాల భవనానికే జూనియర్ కళాశాల బోర్డు పెట్టి, అన్ని సదుపాయాలు ఉన్నట్లు ఫొటోలను అప్‌లోడ్ చేశారు. దీనికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అనుమతి ఇచ్చేశారు.
* ఒక కళాశాల యజమాని ఏకంగా ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐవో) సంతకాన్ని ఫోర్జరీ చేసి, కొత్త కోర్సులకు దరఖాస్తు చేశారు. అధికారులు దీనికి అనుమతులు ఇచ్చేశారు. విద్యార్థులకు ప్రవేశాలూ కల్పించేశారు. విద్యార్థులు కళాశాలకు రాకుండానే పరీక్షలు రాయించేలా దీన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల విద్యార్థుల పరీక్ష ఫీజులను చెల్లించేందుకు యజమాని రాగా.. ఇంటర్ విద్యామండలి ఫీజుల చెల్లింపును నిలిపివేసింది.
* కొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పటికే విద్యార్థుల ప్రవేశాలు పూర్తయినందున ఈసారి పరీక్ష రాసేందుకు అనుమతించాలా? వద్దా? అనేదానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
విచారణ కొనసాగుతోంది
వృత్తి విద్యా కళాశాలల అనుమతులు, కోర్సుల మంజూరులో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశాం. డీడీలు ఇవ్వకుండానే అనుమతులు పొందిన యాజమాన్యాల నుంచి ఆ మొత్తం వసూలు చేస్తాం. -రామకృష్ణ, కార్యదర్శి, ఇంటర్ విద్యామండలి
ఇదీ చదవండి:
'రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు.. కానీ...'