Irregularities in Rythu Bharosa centers: ధాన్యం కొనుగోళ్లలో రైతు భరోసా కేంద్రాల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 48 మంది వీఏఏలను సస్పెండ్ చేయగా.. వందల మందికి తాఖీదులిచ్చారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లోనూ అవకతవకలు వెలుగు చూశాయి. పంట నమోదులోనే కాకుండా.. ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలులోనూ పెద్ద ఎత్తున అక్రమాలున్నాయి. ధాన్యం అక్కడికి తీసుకురాకుండా నేరుగా మిల్లులకే తరలుతున్నా.. అన్నీ వాటి ద్వారా కొనుగోలు చేసినట్లే చూపిస్తున్నారు.
ఈ-క్రాప్ నుంచీ మొదలై:ఈ-క్రాప్ నమోదులోనే అక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ధాన్యం కొనుగోలు వరకు ఇవి కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో వ్యవసాయ సహాయకులు బీడు భూములు, ఆక్వా చెరువులు, రోడ్లు, ఇళ్ల స్థలాలనూ తమ బంధువుల పేర్లతో పంట పొలాలుగా నమోదు చేశారు. మరికొన్ని చోట్ల ధాన్యం వ్యాపారులు, మిల్లర్లు చెప్పిన పేర్లను జాబితాల్లోకి ఎక్కించారు. కోనసీమ జిల్లాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. తర్వాత ప్రభుత్వం విచారణ చేయించగా.. పలు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అసలు పొలం సాగు చేయని వారి పేరుతోనూ ధాన్యం అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. ఉచిత పంటల బీమా పరిహారంలోనూ అనర్హుల పేర్లు ఉన్న విషయం వెల్లడైంది. భారీగా సొమ్ము అక్రమార్కుల పేరుతో విడుదలైంది. గ్రామాల్లో పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వీటిపై విచారణ చేయించింది. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయకులు తమ ఇష్టానుసారం ఈ-క్రాప్ చేశారని వెల్లడైంది. దీంతో కొన్ని చోట్ల బీమా పరిహారం చెల్లించకుండా నిలిపేశారు.
అధికారులు పరిశీలించలేదా? గుర్తించలేదా?:ఈ-క్రాప్ నమోదుపై అధికారుల స్థాయిలో పర్యవేక్షణ మొక్కుబడి చందంగా తయారైంది. ఈ-క్రాప్‌లో నమోదైన వివరాల్లో 10% నమోదును జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, 20% నమోదును అప్పటి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు, డిప్యూటీ డైరెక్టర్లు తనిఖీ చేయాలి. మండల స్థాయిలోని వ్యవసాయ అధికారులు 30% నమోదు వివరాలను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంత మంది పర్యవేక్షిస్తున్నా అవకతవకలు బయటపడకపోవడం.. అధికార యంత్రాంగం పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతోంది.