ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Iron Age Landmarks మూసాపేటలో ఇనుపయుగం ఆనవాళ్లు - లోయపల్లిలో ఆత్మాహుతి వీరుల విగ్రహ శిలలు

Iron Age Landmarks in Moosapet ఇనుపయుగం నాటి ఆనవాళ్లను పరిశోధకులు మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేటలో వెలికితీశారు. మూసాపేటలో ఇనుపయుగం నాటి సమాధుల్ని గుర్తించినట్లు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా లోయపల్లిలో 5 ఆత్మాహుతి వీరగల్లులను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనరు రామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు.

Iron Age Landmarks in Moosapet
ఇనుపయుగం ఆనవాళ్లు

By

Published : Aug 23, 2022, 12:03 PM IST

Iron Age Landmarks in Moosapet: మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం మూసాపేటలో ఇనుపయుగం నాటి సమాధులు ఉన్నాయని ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మూసాపేట రామస్వామిగుట్ట సమీపంలోని ఈ రాళ్లను ఆయన సోమవారం పరిశీలించారు. ‘చనిపోయినవారిని పూడ్చి వారి జ్ఞాపకంగా పెద్దరాళ్లతో ఈ సమాధులు నిర్మించారు. స్థానికులు వీటిని ముత్యంగుండ్లు అంటున్నారు. ఇక్కడ 1988లో వంద సమాధులు ఉండగా.. ప్రస్తుతం ఆరు మాత్రమే మిగిలి ఉన్నాయి. తెలంగాణలో ఇనుపయుగం చరిత్రకు, తొలితరం కట్టడ నైపుణ్యానికి ఆనవాళ్లు అయిన వెయ్యేళ్ల క్రితం నాటి ఆ సమాధుల్ని కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించాలి’ అని శివనాగిరెడ్డి కోరారు.

లోయపల్లిలో ఆత్మాహుతి వీరగల్లులు..రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి సోమన్నగుట్ట వద్ద 5 ఆత్మాహుతి వీరగల్లులను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనరు రామోజు హరగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నరికిన తలలను తమ చేతులతో పట్టుకున్న వీరుల వీరగల్లులు ఇందులో ఉన్నాయని, ఇలాంటివి తెలంగాణలో వెలుగుచూడటం ఇదే తొలిసారన్నారు. బృందం సభ్యుడు యాదేశ్వర్‌ వీటిని గుర్తించాడని తెలిపారు. ‘ఈ వీరగల్లులు 14, 15వ శతాబ్ద కాలం నాటివి. శత్రువుల నుంచి ఊరి పొలిమేరల్ని, స్త్రీలను, పశువులను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల జ్ఞాపకార్థం చేసిన విగ్రహ శిలలను వీరగల్లులు అంటారు’ అని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details