B Venkateswara Rao wrote a letter to CS: ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి దానంతట అదే తొలగిపోయినట్లేనని పేర్కొంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు లేఖ రాశారు. సస్పెన్షన్ విధించి రెండేళ్లు దాటిపోయిందని లేఖలో తెలిపారు. అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం ఈ కాలవ్యవధిలోనే అభియోగాలపై విచారణ పూర్తి చేయాలన్నారు. ఏదైనా తేలితే దాని ఆధారంగా చర్యలకు ఆదేశాలివ్వాలని కోరారు. నా విషయంలో నిర్దేశిత వ్యవధిలో ఇవేవీ జరగలేదని లేఖలో తెలిపారు.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సమీక్ష కమిటీ సిఫార్సు చేయాలన్నారు. సమీక్ష కమిటీ అలాంటి సిఫార్సులేవీ చేయలేదని తెలిపారు. 2020 ఫిబ్రవరి 8 నుంచి ప్రభుత్వం నా సస్పెన్షన్‌ను ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వచ్చిందన్నారు . దీని ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 8 నాటికి నాపై సస్పెన్షన్ విధించి రెండేళ్లు పూర్తయిందన్నారు. ఆ రోజు నుంచి పూర్తి వేతనం పొందేందుకు అర్హత ఉందని తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి వేతనం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోగలరు’ అని లేఖలో వివరించారు. 2020 ఫిబ్రవరి 8న నన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారని.. కేంద్ర హోం శాఖ దాన్ని నిర్ధారిస్తూ 2020 ఏప్రిల్ 7లోగా అభియోగపత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించిందన్నారు. గడువులోగా ప్రభుత్వం అభియోగపత్రం దాఖలు చేయలేదన్నారు. ఆ తర్వాత నా సస్పెన్షన్‌ను 2020 ఆగస్టు 5 వరకూ పొడిగిస్తూ మరో జీవో ఇచ్చారు. 2020 మే 22న హైకోర్టు డివిజన్ బెంచి ఆ సస్పెన్షన్ ఆదేశాల్ని కొట్టేసిందన్నారు. సస్పెన్షన్ చట్టవిరుద్ధమని, చెల్లదని పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుందని లేఖలో తెలిపారు.