సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరపనుంది. పిటిషన్ బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ముందుకు విచారణకు వచ్చింది. వివరాలు సమర్పించేందుకు వ్యాజ్యాన్ని వాయిదా వేయబోతుండగా.. అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు న్యాయమూర్తిని కోరారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరాలు సమర్పించాల్సిన ఉన్న నేపథ్యంలో అత్యవసర విచారణ ఎలా సాధ్యమని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయవాది స్పందిస్తూ.. అత్యవసరంగా విచారణ జరపాల్సిన అంశాలు ఈ వ్యాజ్యంతో ముడిపడి ఉన్నాయన్నారు.
పీపీ శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ.. నేరమే నమోదు కాని విషయంలో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారన్నారు. వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల గడువు కోరారు. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ.. సీఐడీ, ఏసీబీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చామన్నారు. ఆ సంస్థల తరఫు స్టాండింగ్ కౌన్సెళ్ల పేర్లను రోజువారీ కేసుల విచారణ జాబితాలో ప్రచురించాలని కోరారు. అత్యవసర విచారణ జరపాలని మరోసారి అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు. నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో పోలీసులు తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని, ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.