రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు అంతంత మాత్రమే. వ్యవసాయమే ప్రధాన ఆధారం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షించాలనుకుంటే బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. ఆ పనిని అమరావతి సమర్థంగా నిర్వహించింది. లక్ష కోట్లకుపైగా ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. కొన్ని ఆచరణలోకి వచ్చాయి. మూడు రాజధానుల ప్రకటనతో ఈ పరిస్థితి మారింది. అమరావతి చుట్టుపక్కల వస్తాయనుకున్న పెట్టుబడుల్లో కొన్ని రద్దయ్యాయి. మిగతావి సందిగ్ధంలో పడ్డాయి.
ప్రపంచబ్యాంకు విముఖత
అమరావతిలో ప్రాథమికంగా వస్తాయనుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడుల విలువే సుమారు రూ.44, 300 కోట్లు ఉంటుంది. అటు..అమరావతికి రూ.7,200 కోట్లు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ సంసిద్ధమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వ రుణంపై విముఖత వ్యక్తం చేయడంతో ప్రపంచబ్యాంకు ఆ ప్రాజెక్టును రద్దు చేసుకుంది.
రద్దు చేసుకుంది
అమరావతిలో 1691 ఎకరాల్లో సింగపూర్ సంస్థల కనన్సార్షియం-ఏడీసీ కలసి అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు తలపెట్టాయి. దీనికి తొలి దశలోనే సుమారు 50వేల కోట్ల పెట్టుబడులు వచ్చేవని అంచనా. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి తెలిశాక సింగపూర్ కన్సార్షియం ప్రాజెక్టును రద్దు చేసుకుంది.
పడని ఔటర్ రింగ్ రోడ్డు
రాజధాని అమరావతి చుట్టూ రూ. 7, 761 కోట్ల వ్యయంతో 189 కి.మీ పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని తలపెట్టారు. ఇది ఆచరణలోకొస్తే.. ఓఆర్ఆర్ చుట్టూ భారీ పెట్టుబడులు వచ్చేవి. ఇప్పుడు వీటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పరిస్థితి తలకిందులు
విజయవాడ,గుంటూరు మార్గంలో కనకదుర్గ వారధి దాటిన తర్వాత..తాడేపల్లి నుంచి మంగళగిరి కాజ వరకు నాలుగేళ్లలో నిర్మాణరంగంలో కొన్ని వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాజదాని ఇక్కడే కొనసాగితే ఆ ప్రాంతంలో భారీ వాణిజ్య నివాస సముదాయాల నిర్మాణానికి, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు చాలా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. మూడు రాజధానుల ప్రకటనతో పరిస్థితి తలకిందులైంది.
పునరాలోచనలో విద్యాసంస్థలు
అమరావతిలో ప్రతిష్టాత్మక విట్, ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలు తరగతులు ప్రారంభించాయి. అమృత యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) నిర్మాణాలు జరుగుతున్నాయి. నిట్, ఎస్ఆర్ఎమ్, అమృత వర్సిటీల పెట్టుబడుల ప్రతిపాదనలే 10వేల కోట్లు. ఇప్పుడు మొదట అనుకున్న స్థాయిలో పెడ్డుబడులపై ఆ సంస్థలు పునరాలోచనలో పడే అవకాశముంది.
నిర్మణ రంగం కుదేలు
ఏపీఎన్ఆర్టీ సంస్థ10 ఎకరాల్లో రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో 33 అంతస్తుల ఐకానిక్ టవర్ నిర్మాణం తలపెట్టింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య, నివాస ప్రాంతం అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో శంకుస్థాపన జరిగింది. దీనికి ప్రవాసాంధ్రుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. బుకింగ్‌లు పూర్తయ్యాయి. రాజధాని తరలిపోతే ఈప్రాజెక్ట్ సందిగ్ధంలో పడినట్లే. హ్యాపీనెస్ట్ పేరుతో ప్లాట్లు విక్రయించేందుకు సీఆర్డీఏ తలపెట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. నిమిషాల్లోనే ప్లాట్లు బుక్ అయ్యాయి. ఈ స్పందనతో హ్యాపీనెస్ట్ 2 ప్రాజెక్టునూ సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ అయోమయంలో పడింది.
ఏపీ పెట్టుబడులపై మూడు రాజధానుల ఎఫెక్ట్ ఇదీ చదవండి : న్యాయవిచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: చంద్రబాబు