Investment proposals in AP: కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజాగా వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం 2022లో జులై వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనల విలువ 6 వేల 173 కోట్లే. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏపీ తొమ్మిదో స్థానంలో ఉంది. గుజరాత్, ఒడిశా, కర్ణాటక తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌తో పోలిస్తే రాష్ట్రానికి పదమూడో వంతు పెట్టుబడులు రాలేదు. అయితే సమాచార, పౌర సంబంధాలశాఖ మాత్రం ఈ ఏడాది జులై వరకు రాష్ట్రానికి 40 వేల 361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా ఉందంటూ ప్రకటన విడుదల చేసింది. ఇక్కడే అసలు మతలబు ఉంది.
డీపీఐఐటీ గవర్నమెంట్ టు బిజినెస్ పోర్టల్:
సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, పారదర్శకతను నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా డీపీఐఐటీ కొన్నేళ్ల క్రితం గవర్నమెంట్ టు బిజినెస్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఉత్పాదక రంగంలో 10 కోట్లకు పైగా, సేవారంగంలో 5 కోట్లకుపైగా పెట్టుబడులతో ఏర్పాటైన పరిశ్రమలు.. ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్ మెమొరాండం పేరుతో రెండు దశల్లో దరఖాస్తులు సమర్పించాలని నిర్దేశించింది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు, విస్తరణకు వెళ్లే పరిశ్రమలు ఐఈఎం పార్ట్-ఎ సమర్పించాలి. పరిశ్రమ ఏర్పాటై, ఉత్పత్తి ప్రారంభమయ్యాక పార్ట్-బి సమర్పించాల్సి ఉంటుంది.
నెలవారీగా పార్ట్-ఎ, పార్ట్-బి సమర్పించిన పరిశ్రమల వివరాలు:
అలా నెలవారీగా పార్ట్-ఎ, పార్ట్-బి సమర్పించిన పరిశ్రమలు, రాష్ట్రాలవారీగా పెట్టుబడుల వివరాల్ని డీపీఐఐటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. గతంలో ఒప్పందాలు జరిగి, ఉత్పత్తి ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత పార్ట్-బిని సమర్పించవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి డీపీఐఐటీ పార్ట్-బిలో వెల్లడించిన వివరాల్లోనూ గత ప్రభుత్వాల హయాంలో ఒప్పందాలు చేసుకున్న వాటిని పేర్కొనడం జరిగింది. కొన్నేళ్ల క్రితమే ఉత్పత్తి ప్రారంభించినవే. ఇప్పుడు పార్ట్-బి సమర్పించిన కంపెనీల వివరాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే పార్ట్-బిలో పేర్కొన్న పెట్టుబడులన్నీ ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో వచ్చినట్లు కాదని అర్థమవుతోంది. గతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తున్నవన్నమాట.