రాత్రి ఉండిపోయిన బిర్యానీ, నిన్న మిగిలిన కూర, మొన్న మిగిలిన చారు, వారం క్రితం రుబ్బిన ఇడ్లీ, దోశ పిండి, పప్పులూ, దినుసుల వంటి రకరకాల పదార్థాలతో ప్రతి ఇంట్లోనూ కిక్కిరిసిపోయి ఉంటుంది ఫ్రిజ్. పదార్థాలు పాడవకుండా, చల్లచల్లగా మన డైనింగ్‌టేబుల్‌పైకి తీసుకొస్తున్న ఫ్రిజ్ మన జీవితాల్లో భాగమవడానికి కారణం ఫ్లోరెన్స్ పార్పార్ట్. తనింట్లో మిగిలిపోయిన పదార్థాలు నిల్వ ఉండక పాడవుతూ తరచూ పడేయాల్సి రావడంతో ఆ సమస్యని అధిగమించడానికి ఫ్లోరెన్స్ 1914లో ఫ్రిజ్‌కి రూపకల్పన చేసి దానికి పేటెంట్ పొందింది. అంతకుముందు వీధులు ఊడ్చే యంత్రాన్నీ రూపొందించిందామె.
డయపర్:
నేటి తల్లులు డయపర్‌లు లేని ప్రపంచాన్ని అసలు ఊహించలేరు. అవి మనదేశంలోకి రాకముందు తరచూ పిల్లల తడి బట్టలు మారుస్తూ... వాటిని ఉతుకుతూ ఎంతో శ్రమపడేవారు. ఒకప్పుడు ఆ కష్టాలన్నీ పడిన మారియాన్ దోనోవాన్ వాటికి పరిష్కారంగా డయపర్‌లను కనిపెట్టింది. స్నానాల గదిలో వాడే షవర్ కర్టెన్‌లో కొంత భాగాన్ని తీసి తన దగ్గరున్న కుట్టుమిషన్ సాయంతో ‘వాటర్‌ప్రూఫ్’ డ్రాయర్‌గా కుట్టింది. ముందు తన పాపకే వాడి చూసి.. దానివల్ల ఇబ్బందులేమీ లేవని నిర్ధారించుకుంది. దానికి ‘బోటర్’ అని పేరుపెట్టి పేటెంట్ కూడా తీసుకుంది. ఇప్పుడవే అప్‌డేట్ అయి ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్కెట్‌లోకి వస్తున్నాయి.
డిష్‌వాషర్:
జోసెఫిన్ కాక్రేన్... డిష్‌వాషర్ సృష్టికర్త. జోసెఫిన్ భర్త విలియం కాక్రేన్ కోటీశ్వరుడు. వాళ్లింట్లో తరచూ ఏదో ఒక పార్టీ జరుగుతూనే ఉండేది. ఆ పార్టీలో జోసెఫిన్ ఇంట్లో ఉన్న చైనా పింగాణీ పాత్రల్లోనే వడ్డించేది. అలానే పార్టీ అయ్యాక ఆ పాత్రలన్నీ శుభ్రం చేసి జాగ్రత్త చేయాల్సిన బాధ్యత కూడా జోసెఫిన్‌దే. దాంతో ఆమె చాలా ఇబ్బంది పడేది. అందుకే ఆ పనిని కాస్త సులువు చేయాలనే లక్ష్యంతో డిష్‌వాషర్‌కి రూపకల్పన చేసింది. మొదట్లో తన కోసమే దీన్ని తయారు చేసుకున్నా... తరవాత దాన్నే వృత్తిగా ఎంచుకుని గారిసన్- కాక్రేన్ పేరుతో కంపెనీ పెట్టి ఎంతోమంది మహిళలకి డిష్‌వాషర్లను పరిచయం చేసింది.