కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా పోలీసు ఆఫీసర్‌నే వాహనంతో ఢీకొట్టి ముందుకు వెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకోవడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గోపీనాథ్‌రెడ్డి ఈటీవీ ప్రతినిధికి పలు విషయాలు వెల్లడించారు.
గర్వంగా ఉంది: ఎస్ఐ గోపినాథ్ రెడ్డి
- పులివెందులలో ఏం జరిగింది? మద్యం మాఫియాను ఏవిధంగా పట్టుకున్నారు?
గోపీనాథ్‌రెడ్డి: ఒక వాహనంలో మద్యం అక్రమరవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో పార్నపల్లి రోడ్డులో రాఘవేంద్ర హాల్ సమీపంలో వాహనాల తనిఖీ ప్రారంభించాం. ఆ సమయంలో ఒక వాహనం సమీపంలోకి వచ్చి వేగం తగ్గించింది. మా దగ్గరికి రాగానే ఒక్కసారిగా వేగం పెంచారు. ఈ పరిణామంతో వాహనాన్ని ఆపేందుకు అడ్డుగా వెళ్లిన నేను బానెట్ మీద పడ్డాను. నిందితుడు వేగం పెంచడంతో అక్కడి నుంచి వాహనంపైకి ఎక్కి గట్టిగా పట్టుకొని ఒకటిన్నర కిలోమీటరు అలాగే వెళ్లాను. ఈ క్రమంలో వాహనం అద్దాలు పగిలాయి. దాన్ని మరింత పగులగొట్టి కారు లోపలికి వెళ్లాను. నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. వాళ్లను ఎస్పీ ఆదేశాల మేరకు త్వరలోనే పట్టుకుంటాం. కారులో మొత్తం ఇద్దరు నిందితులున్నారు.
- కారు బానెట్ మీద పడేందుకు మీకు ధైర్యం ఎలా వచ్చింది? ఆ సమయంలో నిందితుల ప్రవర్తన ఎలా ఉంది?
గోపీనాథ్‌రెడ్డి: కారు బానెట్ మీద పడినప్పుడు మనం గాయాల పాలు కాకుండా ఉండాలంటే అదొక్కటే మార్గం. కిందికి దిగినా, ఏం చేసినా.. కారు కింద పడటమో, డివైడర్‌కు తల కొట్టుకోవడమో జరుగుతుంది. అక్కడున్న ఒకే ఒక మార్గం వాహనాన్ని ఆపడం. వాళ్లు ఎలాగూ ఆపరు కాబట్టి నేనే వాహనంలోకి దిగాలి. అందువల్ల పగిలిన అద్దాన్ని మరింత పగులగొట్టి లోపలికి వెళ్లాను.
- మీ దగ్గర ఆ సమయంలో ఆయుధం ఉందా? లేదా? మీరు సివిల్ డ్రెస్‌లో ఉన్నట్లు సీసీ కెమెరాలో కనిపిస్తోంది.
గోపీనాథ్‌రెడ్డి: నాతో పాటు సిబ్బంది అంతా ఉన్నారు. వాళ్లు కూడా నిందితుల్ని ఆపడానికి ప్రయత్నించారు. పక్కన వాళ్లంతా యూనిఫామ్‌లోనే ఉన్నారు. పక్కనున్న సిబ్బంది కూడా అప్పటికే ఆ అద్దాలు లాగడానికి ప్రయత్నించారు. కానీ అంత సమయం దొరకలేదు. ఒక కానిస్టేబుల్ ముందుగానే వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించి అద్దం మీద గట్టిగా కొట్టారు. ఆ సమయంలో కూడా అద్దం కొంత పగిలి ఉండవచ్చు. ఏ సమయంలో అద్దం పగిలిందని చెప్పడం కష్టం. సిబ్బంది కూడా జీపులో వాహనాన్ని ఛేజ్ చేసుకుంటూ వచ్చారు. నిందితులపై ఇతర కేసులేమైనా ఉండొచ్చు. వాటి నుంచి తప్పించుకునేందుకు ఇలా పారిపోవడం చేసి ఉండవచ్చు. - పులివెందుల పట్టణంలో ఓ సెన్సిటివ్ ప్రాంతంలో మీరు ఎందుకు అంత సాహసం చేయాల్సి వచ్చింది?
గోపీనాథ్‌రెడ్డి: సాహసం అనేది ఏం లేదు. విధుల్లో భాగంగా ప్రయత్నించాం. అనుకోని విధంగా నిందితుడు వాహనంతో ఢీకొట్టాడు. దీంతో వాహనం మీద పడ్డా. ఇటువంటి పరిస్థితుల్లో అద్దం పగులగొట్టి వాహనంలోకి వెళ్లాల్సి వచ్చింది.
- నిందితుడు ఏటీఎంల దొంగతనం చేస్తున్నట్లు గత చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది?