ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అపోహలు వీడితే.. భవిష్యత్తు అణువిద్యుత్తుదే:అణుశక్తి నియంత్రణ మండలి ఛైర్మన్‌ - అణుశక్తి నియంత్రణ మండలి ఛైర్మన్‌ నాగేశ్వరరావు

Nageswara Rao: అణువిద్యుత్తు కేంద్రాల వల్ల నష్టం వాటిల్లుతుందనే అపోహలు తొలగించుకుని, వాటి ఏర్పాటుకు అందరూ సహకరిస్తే ప్రజలకు, భావితరాలకు మేలు జరుగుతుందని ప్రముఖ శాస్త్రవేత్త, అణుశక్తి నియంత్రణ మండలి (భారత ప్రభుత్వ అధీనంలోని ఆటమిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు) ఛైర్మన్‌ జి.నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు వచ్చిన ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో మాట్లాడారు.

Nageswara Rao
అణుశక్తి నియంత్రణ మండలి ఛైర్మన్‌

By

Published : Aug 2, 2022, 12:11 PM IST

Nageswara Rao: 35 దేశాల్లో ఐదారు దశాబ్దాలుగా అణు విద్యుత్తు కేంద్రాలు నడుస్తున్నాయని, వాటి వల్ల మానవ జాతికి ఎంతో మేలు కలిగిందని గుర్తుచేశారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో 10 శాతం అణు విద్యుత్తేనని, ఈ తరహా విద్యుత్తును ఉపయోగించుకునే అతి కొద్ది దేశాల్లో భారత్‌ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్నిచోట్ల జరిగిన ప్రమాదాల వల్ల అణువిద్యుత్తు కేంద్రాలంటే ప్రజల్లో భయాందోళన నెలకొందని, గతంలో కంటే ఇప్పుడు భద్రతాపరంగా అనేక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో 22 న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. ఆధునిక దేశాల మాదిరిగా నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తూ ఆయా యూనిట్లలో ప్రమాదాలు జరగకుండా బోర్డు బాధ్యత వహిస్తోందని వివరించారు. ప్రస్తుతం అణువిద్యుత్తు రంగంలో వచ్చిన మార్పులు, ప్రయోజనాలను వివరించారు.

పవర్‌షిఫ్ట్‌ చాలా సంవత్సరాలుగా విన్పిస్తున్న మాట. ఇది మనదేశంలో సాధ్యమవుతుందా?

మనం అనుకున్నంత వేగంగా పవర్‌షిఫ్ట్‌ జరగదు. పంచభూతాలతో మన జీవనం ఎలా ఆధారపడి ఉందో నేడు విద్యుత్తుతో అంత ఆధారపడి ఉంది. ప్రస్తుతం మనకు 50 శాతానికి విద్యుదుత్పత్తి కేంద్రాలు బొగ్గు ఆధారితమే. సౌరశక్తి, పవన విద్యుత్తును గమనిస్తే సౌర విద్యుత్తు 100 మెగావాట్లు తయారు చేయాలంటే అది పూర్తిగా మన చేతుల్లో లేదు. వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉంటాడు. అప్పటివరకు ఎంత అవసరమో అంతే ఉపయోగించగలం. వాస్తవంగా మనకు రాత్రిపూట వినియోగం ఎక్కువ. ఆ సమయంలో సౌరశక్తి ఉండదు, కాబట్టి అవసరాలు తీరవు. 14-16 శాతం మాత్రమే సౌర విద్యుత్తు తయారు చేయగలం. గాలి ఎక్కువ వేగంగా వీచినప్పుడే పవన విద్యుత్తు తయారవుతుంది. గాలి ద్వారా 24 శాతానికి మించి సాధించలేం. అనేకచోట్ల నీటి పారుదల లిఫ్ట్‌లున్నాయి. పరిశ్రమలకు నిరాటంకంగా కరెంటు ఇవ్వడం కష్టంగా ఉంటుంది. అదే, అణువిద్యుత్తు వల్ల గ్రిడ్‌లో నిశ్చలమైన విద్యుత్తు సరఫరా చేయగలం. ప్రపంచ దేశాలు దీన్ని గుర్తించాయి. ఇదే పూర్తి ఆధారమని ఎవరూ చెప్పరు. మొత్తం వినియోగంలో 20 శాతం అణువిద్యుత్తు సాధించగలిగితే స్థిరమైన గ్రిడ్‌తో అన్ని రంగాలకు నిరాటంకంగా సరఫరా చేయగలం. ఈ ప్రణాళికతో మేం ముందుకెళ్తున్నాం.

నెట్ జీరో చేరుకోవడంలో అణు ఇంధనం ప్రాధాన్యం ఏంటి?

బొగ్గుతో ఒక యూనిట్ విద్యుత్తు తయారు చేస్తే 1050 గ్రాముల కార్బన్‌డై ఆక్సైడ్‌ విడుదల అవుతోంది. అదే అణు విద్యుత్తు అయితే 50 గ్రాములే విడుదల అవుతుంది. అందువల్ల దీన్ని ఒక వనరుగా ఉత్పత్తి పెంచాలని ప్రణాళిక తయారు చేస్తున్నాం. చైనాతో పోల్చితే జనాభా, పరిశ్రమల పరంగా ఇండియా సమానంగా ఉంది. మనం 22 రియాక్టర్ల ద్వారా 6,780 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. చైనా 38 రియాక్టర్లను పనిచేయిస్తూ 25వేల నుంచి 30వేల మెగావాట్లు వినియోగించుకుంటోంది. ఇకపై ఎక్కువ అణువిద్యుత్తు నిష్పత్తిని పెంచి, బొగ్గు వాడకాన్ని తగ్గించాలని చూస్తోంది. మనమూ అలా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇండియా సమకాలీన దేశం కాబట్టి మన ఆర్థిక పరిస్థితిని గమనించాలి. మనం భయపడి అణువిద్యుత్తు కేంద్రాలు వద్దు అంటే.. వెనుకబడిపోతాం. అనవసర భయాలు తొలగించుకుని అణువిద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలి. నిజంగా ఏది మంచో అది ఎంచుకుని ముందుకెళ్లాలి.

25 శాతం అణు విద్యుత్తు తయారుచేస్తే పర్యావరణం కాపాడుకోగలమని అంటున్నారు. సాధ్యమేనా?

ఇందుకోసం ప్రజలు, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు ఒక తాటిపైకి వస్తే ముందుకు వెళ్లగలం. గతంలో అనేక సందర్భాల్లో కలిసి ముందుకుసాగాం. ఇప్పుడు విద్యుత్తు అవసరాన్ని గుర్తించి సరైన దిశలో సాగితే లక్ష్యాన్ని సాధిస్తాం. ఖర్చుపరంగా చూస్తే అణు విద్యుత్తు చౌకా, ఖరీదా అనేది చెప్పడం కష్టం. సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పుడు మొదట్లో ఖర్చు ఎక్కువగా ఉండేది. పెద్దపెద్ద ప్లాంట్లు భద్రతతో ఏర్పాటు చేస్తున్నాం.

దేశవ్యాప్తంగా న్యూక్లియర్‌ ప్లాంట్ల పర్యవేక్షణలో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు?

పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అణు విద్యుత్తు బోర్డులు ఉన్నాయి. అధికారాలు ఉన్న స్వచ్ఛంద సంస్థ మాది. వియన్నాలో ఇంటర్నేషనల్‌ ఆటమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ సంస్థ ఉంది. అందులో అందరం సభ్యులమే. అంతర్జాతీయంగా భద్రతా ప్రమాణాలను గమనిస్తాం. ఇండియాలో ఏర్పాటు చేసే కేంద్రాల్లో అవే ప్రమాణాలు ఉండేలా చూస్తాం. ఇది ఒక్కటే కాదు, రేడియేషన్‌ వినియోగాలు మనదేశంలో ఉన్నాయి. రేడియో ఐసోటోప్‌లను క్యాన్సర్‌ తగ్గించడానికి వాడుతున్నారు. వైద్యరంగంలో అనేక యంత్రాలు పనిచేస్తున్నాయి. రేడియేషన్‌ వల్ల హాని జరుగుతుందనే అపోహతో కొందరు ఉన్నారు. నిజానికి క్యాన్సర్‌కు రేడియేషన్‌ కారణం కాదు. ఏ ఆస్పత్రిలో చూసినా రేడియేషన్‌ కేంద్రాలుండటమే దీనికి రుజువు. చాలా మందికి తెలియనిది ఏమిటంటే ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ ఒక ప్రామాణికతతో పనిచేసేలా చేయడం, వాటిని వినియోగించే వ్యక్తుల అర్హతలను పరిశీలించడం మా విధుల్లో భాగం. వాటికి లైసెన్స్‌ ఇచ్చే బాధ్యతా మాదే.

దేశంలో కొత్తగా అణువిద్యుత్తు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయా?

700 మెగావాట్ల సామర్థ్యం గల 10 రియాక్టర్లను ఇటీవల మంజూరు చేశారు. తమిళనాడులో రష్యా సహకారంతో నెలకొల్పినవి 1,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాలు ఉన్నాయి. అక్కడే మరో నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నారు. కావలి దగ్గర ఒక చోట స్థల పరిశీలన జరుగుతోంది. అక్కడి ప్రజలు ఆహ్వానిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని అణువిద్యుత్తు కేంద్రాలు ఏర్పాటుకు సహకరిస్తే చుట్టుపక్కల అభివృద్ధి జరుగుతుంది. అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి, కనీస వసతులు కల్పిస్తే కేంద్రం ఆర్థిక వనరులు సమకూరుస్తుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ప్లాంట్ల నిర్వహణపై ఉన్న భయాన్ని ఎలా చూడాలి?

అపార చమురు వనరులున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వంటి దేశాల్లోనూ ముందుచూపుతో నాలుగు అణు రియాక్లర్లు ఏర్పాటు చేశారు. వాటిలో రెండు ఇప్పటికే 1,400 మెగావాట్ల చొప్పున విద్తుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. నాలుగూ పనిచేస్తే వాళ్లకి దేశం మొత్తం అవసరాల్లో 25 శాతం విద్యుత్‌ శక్తి వచ్చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతోందో మనం గమనించాలి. తెలియని అపోహలతో సాంకేతికతను దూరం చేసుకోకూడదు. ఈజిప్టు, బంగ్లాదేశ్‌ల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్స్‌ ఏర్పాటుకు అనేక దేశాలు ముందడుగు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో వాహనాలు ఇంధనం కాకుండా విద్యుత్తుతో పనిచేయాలంటే అణు విద్యుదుత్పత్తిని పెంచుకోవాల్సిందే.

అణురంగంలో పరిశోధనా ఫలితాలను వ్యవసాయం వంటి ఇతర రంగాలకు ఎలా ఇవ్వొచ్చు?

అదీ జరుగుతోంది. ముంబయిలోని బాబా ఆటమిక్‌ రీసెర్చి సెంటర్‌ (బార్క్‌)లో పబ్లిక్‌ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌ కింద విజ్ఞానాన్ని బదిలీ చేసి న్యూక్లియర్‌ మెడిసిన్‌ అంటే రేడియో ఐసోటోప్‌ల తయారీలో ఉపయోగిస్తున్నాం. ఆహారం వృథా కాకుండా రేడియేషన్‌ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల వినియోగకాలం పెంచి బయట దేశాలకు పంపే ప్రయత్నం జరుగుతోంది.

దేశంలో అణు ఇంధన పరిశోధనల వైపు యువత ఆసక్తి ఎలా ఉంది?

ఏటా 150-200 మంది ఇంజినీర్లను, మరికొందరు సైన్స్‌ గ్రాడ్యుయేట్లను తీసుకుని న్యూక్లియర్‌ రంగంలో పరిశోధనలపై ప్రాథమిక శిక్షణ ఇప్పిస్తున్నాం. యువత దీనిపై ఆసక్తితో ఉన్నారా, లేరా అని చెప్పడం కష్టం. ఒక ఉద్యోగానికి ప్రకటన ఇస్తే ఎంతమంది దరఖాస్తు చేస్తున్నారనేది ఆసక్తికి ఒక సూచీగా చెప్పొచ్చు. ఇతర ఉద్యోగాల్లో మాదిరిగానే ఇక్కడా బాగానే దరఖాస్తు చేస్తున్నారు.

అణువిద్యుత్తు ప్రాధాన్యం ఎందుకు పెరిగింది? ఈ కేంద్రాల్లో రక్షణపై అనుమానాలు ఎందుకు మిగిలిపోయాయి?

ఇప్పటివరకు రేడియో ధార్మికత వల్ల మన దేశంలో ప్రజలకు, కర్మాగారాల్లో పనిచేసే మనుషులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 50 ఏళ్లకు పైగా అణు విద్యుత్తు కేంద్రాలు సురక్షితంగా పని చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, కేంద్రాల్లో పనిచేసే వాళ్లు అందరి బాధ్యత ఇందులో ఉంది. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 57 శాతం బొగ్గు ఆధారంగా తయారవుతోంది. బొగ్గు వాడకం వల్ల గాలిలో కార్బన్‌ డైఆక్సైడ్‌ పెరిగి కాలుష్యం, వేడి, వాతావరణంలో మార్పులు సంభవించి జీవకోటికి ఇబ్బందులు వస్తున్నాయి. వీటి ప్రభావంతో అనూహ్య వరదలు, అకాల వర్షాలు, వాతావరణ మార్పులు ఇటీవల చూస్తున్నాం. అందుకే ప్రపంచ దేశాలన్నీ విద్యుత్తును ప్రత్యామ్నాయాల ద్వారా తయారీ (పవర్‌షిఫ్ట్‌)పై ఆలోచిస్తున్నాయి. వాటి విధానాలు మారుస్తున్నాయి.

అణువిద్యుత్తు, కేంద్రాలపై భయం పోగొట్టడమెలా?

గతంలో కంటే ప్రజల్లో భయం తగ్గింది. మేమూ అవగాహన కల్పిస్తున్నాం. చెడు అంటే ఎవరూ దాన్ని పెంచరనే విషయాన్ని తెలుసుకోవాలి. నేను 50 ఏళ్లుగా ఈ వ్యవస్థలో పని చేస్తున్నాను. చెడు ఉంటే నేనే పనిచేసే వాణ్ని కాదు. ఈ వ్యవస్థపై నమ్మకం ఉండాలి. గత నేపథ్యం చూసినా అర్థమవుతుంది. కొత్తగా వస్తున్న విధానంలో పెద్ద రియాక్టర్లు తీసేసి చిన్నవి(నావెల్‌) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అవి వస్తే త్వరితగతిని ఏర్పాటు చేస్తాం. రియాక్టర్ల వల్ల భవిష్యత్తులో ఉపయోగం అని మా విశ్వాసం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details