Public examinations in ssc and inter: రాబోయే రోజుల్లో ఒకవేళ కరోనా ఉద్ధృతమై పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేని సమయంలో అంతర్గత పరీక్షల మార్కులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. వీటి ఆధారంగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇందుకోసం తొలిసారి పాఠశాలల స్థాయిలో ఫార్మెటివ్, ఇంటర్‌లో అర్ధ సంవత్సరం పరీక్షలకు ఉమ్మడి ప్రశ్నపత్రం విధానాన్ని తీసుకొచ్చారు. రెండేళ్లుగా పదోతరగతి, గతేడాది ఇంటర్‌కు పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ సమయంలో మార్కుల మదింపు కష్టంగా మారింది. పదో తరగతికి అంతర్గత పరీక్షలు ఫార్మెటివ్, ఇంటర్మీడియట్‌కు పది, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆధారంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం వారికి మార్కులు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటి నుంచి ఉమ్మడి (కామన్) ప్రశ్నపత్రాలతో అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్‌కు రాష్ట్ర స్థాయిలోనే ప్రశ్నపత్రం రూపొందించి సరఫరా చేస్తున్నారు. దీని దృష్ట్యా అంతర్గతంగా నిర్వహించే పరీక్షలే కదా! అని విద్యార్థులు తేలికగా తీసుకుంటే ఒకవేళ పబ్లిక్ పరీక్షలు జరగని సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, లెక్చరర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేక బృందాలతో మూల్యాంకనం పరిశీలన
పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఫార్మెటివ్-1ను కామన్ ప్రశ్నపత్రంతో నిర్వహించింది. ఫార్మెటివ్-2ను ఇదే విధానంలో డిసెంబరు 17 నుంచి 20 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌లో కలిపి సుమారు 73లక్షలకుపైగా విద్యార్థులు రాయనున్నారు. ప్రశ్నపత్రం ఉమ్మడిగా ఉన్నా ఏ పాఠశాల విద్యార్థులకు అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూల్యాంకనం ఆయా ఉపాధ్యాయులే చేస్తున్నారు. పాఠశాల స్థాయికి వచ్చే సరికి జవాబుపత్రాల మూల్యాంకనం సరిగా జరిగిందో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండల విద్యాధికారి స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటులో పరిశీలిస్తున్నారు. ఫార్మెటివ్-1కు ఆన్‌లైన్ ప్రశ్నపత్రాలను పంపగా.. ఫార్మెటివ్-2కు జిల్లా పరీక్షల విభాగం ద్వారా ముద్రించి పంపనున్నారు. మార్కులను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు.