ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ముందస్తు ప్రవేశాలు పొందిన కళాశాలలో సీటు వస్తుందో? లేదోనని తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారు. ఆన్‌లైన్ ప్రవేశాలపై అవగాహన లేని చాలా మంది ఇప్పటికే ప్రైవేటు కళాశాలల్లో పిల్లల్ని చేర్పించారు. నీట్, ఐఐటీ, నీట్ కోచింగ్‌తో పాటు ఇంటర్ బోధించే ప్రైవేటు కళాశాలల్లో సీట్లకు డిమాండ్ ఉంటుంది. దీంతో సీట్లు లభిస్తాయో లేదోననే భయంతో ముందుగానే ప్రవేశాలు పొందారు. కొంత మొత్తం రుసుములు సైతం చెల్లించారు. ఆన్‌లైన్ బోధన కావడంతో ఇప్పటికే కొంతవరకు పాఠ్యాంశాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కళాశాలలు లేకపోవడం, సీట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
ఇంటర్ విద్యామండలి మొదటి విడత కౌన్సెలింగ్‌కు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికి చాలా కళాశాలలు ఆన్‌లైన్‌లో లేవు. అటు కళాశాలలు, ఇటు అధికారుల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యా మండలి పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. ఇంటర్‌లో ఇంత పెద్ద మార్పు తీసుకువస్తున్నప్పుడు దీనిపై ముందు నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. కానీ, అధికారులు ఎలాంటి ప్రచారం లేకుండానే ఆన్‌లైన్ విధానమంటూ ఇటీవల ప్రకటించారు. ఇది తెలియక చాలామంది తల్లిదండ్రులు ప్రతి ఏడాదిలాగే ముందుగానే ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు. ఇప్పుడు ఆన్‌లైన్ ప్రవేశాలతో ఆయా కళాశాలల్లో సీట్లు రాకపోతే పరిస్థితి ఏమిటంటూ ఒత్తిడికి గురవుతున్నారు. ఏటా ఇంటర్‌లో దాదాపు ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు చేరుతున్నారు.