General Bipin Rawat - Sai Teja: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌నాయక్ సాయితేజకు చెందిన ఆసక్తికర అంశం బయటకొచ్చింది. సాయితేజ ఆర్మీలో కొనసాగడంపై అతడి తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయంపై సాయితేజతో మాట్లాడినట్లు అతడి తండ్రి మోహన్ చెప్పారు.
‘నీతో పాటు తమ్ముడినీ ఆర్మీకి తీసుకెళ్లావు. పదోన్నతులు తెచ్చుకుంటున్నావు. ఇదంతా బాగానే ఉన్నా.. ప్రాణాల మీదకు వచ్చే ఉద్యోగం మనకొద్దు.. మానుకో’ అంటూ తండ్రి మోహన్ చెప్పినా, సార్ (బిపిన్ రావత్)తోనే ఉంటానంటూ అమరుడైన లాన్స్‌నాయక్ సాయితేజ బదులిచ్చారు. పారా కమాండోలకు మెరుగ్గా శిక్షణ ఇస్తుండటంతో బిపిన్ రావత్.. ఏడాది కిందట సాయితేజను తన వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించుకున్నారు. రావత్‌ను ఆయన కంటికి రెప్పలా చూసుకునేవారు. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రుల ఒత్తిడితో.. ఆర్మీ నుంచి వైదొలుగుతానని సాయితేజ చెప్పారు. ‘నేను ఉన్నంతవరకూ నువ్వూ ఉండు సాయీ’ అని రావత్ చెప్పారని ఆయన తండ్రి మోహన్ పేర్కొన్నారు.
ఆర్మీ సిఫాయిగా చేరి..
Lance Naik Sai Teja dead: సాయితేజ్.. 2013లో ఆర్మీ సిఫాయిగా చేరాడు. సిఫాయిగా పని చేస్తూ ఏడాది తర్వాత పరీక్షలో ఉత్తీర్ణుడై పారా కమెండోగా ఎంపికయ్యాడు. లెవెన్త్ పారాలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బెంగళూరులో సిఫాయిలకు శిక్షకుడుగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయితేజ్‌కు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. వీరి కుటుంబం గత ఏడాదిగా మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటుంది. మరోవైపు సాయితేజ్ మరణంతో.. గ్రామంలో విషాదం నెలకొంది.