ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో.. విమర్శలు, హామీలతో వాడివేడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం - trs, bjp, congress campaigning

తెలంగాణలో అధికార, విపక్షాల విమర్శలు, సవాళ్లతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ తెరాస ప్రచారం సాగిస్తుంటే.. ఉద్యోగ నియామకాలపై భాజపా ప్రతివిమర్శలు చేస్తోంది. తెరాస, భాజపాలు రెండూ ప్రజల్ని మోసం చేస్తున్నాయని... ప్రశ్నించే గొంతుకల్ని గెలిపించాలంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతర అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

mlc
తెలంగాణ: విమర్శలు, హామీలతో వాడివేడిగా ఎమ్మెల్సీ ప్రచారం

By

Published : Mar 6, 2021, 6:55 AM IST

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా విభజన హామీలను విస్మరిస్తోందంటూ తెరాస ప్రచారం చేస్తోంది. ఖమ్మం - నల్గొండ - వరంగల్‌ స్థానానికి తననే గెలిపించాలంటూ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ వాణీదేవి... ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓటర్లను అభ్యర్థించారు.

అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొంటూ... భాజపా, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగాలు లేకుండా చేస్తూ... రాష్ట్రంలో నియామకాలపై ప్రశ్నించడమేంటని ఎమ్మెల్సీ గ్యాదరి కిశోర్‌ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు తొలగించేందుకే కేంద్రం ప్రైవేటీకరణ చేపడుతోందని శంషాబాద్‌లో ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

జోరుగా భాజపా ప్రచారం...

తెరాస విమర్శలను తిప్పికొడుతూ భాజపా జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. వరంగల్‌ గ్రామీణ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. నల్గొండలో పోలింగ్‌బూత్‌ల సమ్మేళన సభ నిర్వహించి... భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. మంత్రి ఎర్రబెల్లి... పాలకుర్తికి కనీసం డిగ్రీ కళాశాల తీసుకురాలేకపోయాడని మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే రఘునందర్‌ రావు విమర్శించారు. హైదరాబాద్‌ ఇందిరాపార్కులో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌ రావుతోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్వకుంట్ల కుటుంబానికి తప్ప... నిరుద్యోగ యువతకు రావడంలేదని విమర్శించారు.

హామీల అమల్లో విఫలం...

తెరాస, భాజపా కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఓటర్ల చెంతకు వెళ్తోంది. రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌-హైదరాబాద్ స్థానానికి సంబంధించిన ప్రచారంలో ఎంపీ రేవంత్‌ రెడ్డి పలు సభల్లో పాల్గొన్నారు. విభజన హామీలు నెరవేర్చడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్ని అంశాల్లోనూ భాజపాకు మద్దతిస్తూ... మోదీ చేశారని చెప్పడమేంటంటూ... తెరాసపై విరుచుకుపడ్డారు.

స్వతంత్రులూ...

స్వతంత్రులూ ఇతర పార్టీల నేతలూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పదవిలో ఉన్నా లేకున్నా నిరంతంర ప్రజల కోసం పోరాడుతున్న తనను గెలిపించాలని... తెలుగుదేశం అభ్యర్థి ఎల్. రమణ.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓటర్లను కోరారు. భాజపా, తెరాస వల్లే కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ... వామపక్షాల అభ్యర్థి విజయసారథి రెడ్డి రైల్వేస్టేషన్‌ ముందు నిరసనకు తెలిపారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో తనకు ఓటు వేసి గెలిపించాలని... బీఎల్​ఎఫ్ అభ్యర్థి చెరుకు సుధాకర్‌ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

ఇదీ చదవండి:

ఉక్కు బంద్ విజయవంతం..

ABOUT THE AUTHOR

...view details