ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనవరి ఒకటో తేదీ నుంచి సమగ్ర భూ సర్వే మొదలవ్వాలి: సీఎం జగన్ - ఏపీలో సమగ్ర భూ సర్వే వార్తలు

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రికార్డులు తారుమారు చేసేందుకు వీల్లేకుండా డిజిటలైజేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

cm jagan
cm jagan

By

Published : Oct 23, 2020, 5:25 AM IST

రాష్ట్రంలో భూములపై శాశ్వత హక్కు కల్పించడమే లక్ష్యంగా సమగ్ర సర్వే చేపడుతున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. భూముల రీసర్వే ప్రాజెక్టుపై అధికారులతో గురువారం సమీక్షించిన ముఖ్యమంత్రి... 2021 జనవరి 1 నుంచి ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 22 వేల చదరపు కిలోమీటర్లలో చేపట్టనునన్న సమగ్ర సర్వేను వీలేనంత వేగంగా పూర్తి చేయాలన్నారు. డ్రోన్‌లు, రోవర్లు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు. వందేళ్ల తర్వాత చేపడుతున్న ఈ రీసర్వేతో భూ రికార్డులను పక్కాగా డిజిటలైజ్ చేయాలన్నారు. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశమున్నందున సర్వేయర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రికార్డులు తారుమారు కాకుండా డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టాలని సీఎం నిర్దేశించారు. భూరికార్డులు మార్చివేయడానికి అవకాశం లేకుండా జాగ్రత్త వహించాలన్నారు.

మూడు దశల్లో సర్వే

భూముల రీసర్వే ప్రక్రియను మూడు దశల్లో చేపట్టడం ద్వారా 2023 నాటికి పూర్తి చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ప్రతి మండలానికి మూడు బృందాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4,500 బృందాలు పనిచేస్తాయని నివేదించారు. ముందుగా సాగు భూములు, గ్రామ కంఠాలు, పురపాలికల్లో ప్రక్రియ మొదలు పెడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూవివాదాల పరిష్కారానికి మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రీసర్వే ప్రక్రియ కోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలు సహా 70 కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఐజీఎస్ ద్వారా శాటిలైట్ చిత్రాలు, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సమగ్ర సర్వే సెటిల్‌మెంట్ కొనసాగుతుందని సీఎంకు అధికారులు తెలియజేశారు.

ఇదీ చదవండి

'ఎన్నికల పెట్టుబడిగా భావించి ఇప్పుడు ఖర్చు చేయండి'

ABOUT THE AUTHOR

...view details