NGT: రాయలసీమ ఎత్తిపోతలపై తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశం - ap latest news
12:18 July 23
కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశం
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు సహకరించట్లేదని.. ఎన్జీటీ (NGT) బెంచ్‌కు కృష్ణా బోర్డు తెలిపింది. ప్రాజెక్టుపై గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ధిక్కరణ వ్యాజ్యాలపై.. జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనం విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేసినట్టు కృష్ణా బోర్డు, ఏపీ ప్రభుత్వం తెలిపాయి. ప్రాజెక్టు సందర్శనకు సహకరించట్లేదన్న బోర్డు అఫిడవిట్‌పై వివరణ ఇస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సందర్శనకు పంపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. తామే అక్కడి పరిస్థితులను వివరిస్తూ సమాధానం ఇస్తామని వెల్లడించింది.
డీపీఆర్ (DPR) తయారీకి పర్యావరణశాఖ, కేంద్ర జలసంఘం అడిగిన అంశాలపైనే అధ్యయనం చేస్తున్నామని వివరించింది. ఎన్జీటీ (NGT) బృందం ప్రాజెక్టును సందర్శించాలని తెలంగాణ కోరింది. హెలికాప్టర్, సౌకర్యాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర అదనపు AG తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డును ఎన్జీటీ (NGT) ఆదేశించింది. నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయన్న ఎన్జీటీ (NGT) .. నిబంధనలు ఉల్లంఘించి పనులు జరుపుతారని భావించట్లేదని వ్యాఖ్యానించింది. ఉల్లంఘనలకు పాల్పడితే తగు చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ ఆగష్టు 9కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం