గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందించే దిశగా తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఓపీ సేవలకే పరిమితమైన ఇందులో ఇన్‌పేషెంట్ సేవలు కూడా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వంద పడకల ఆసుపత్రిలో సాధారణ (జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్స్, ఆప్తమాలజీ, గైనకాలజీ, ఫ్యామిలీ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ), పది పడకలతో కొవిడ్ ఐసోలేషన్ ఇన్‌పేషెంట్ సేవలు కొనసాగుతున్నాయి. రూ. 10 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఏడాది పాటు ఓపీ సేవలందిస్తున్నారు. తక్కువ ధరకే రోగ నిర్ధారణ పరీక్షలు (రక్త, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే) చేస్తున్నారు. అన్ని రకాల జనరిక్ మందులనూ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రోజూ 400 మంది ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారు.
మొదలైన శస్త్రచికిత్సలు
ఇప్పటి వరకు 90 మంది వైద్యులు, 128 మంది నర్సులు విధుల్లో చేరారు.మరో 72 మంది వైద్యులు, వంద నర్సు పోస్టులను ఈ నెలాఖరులోపు భర్తీ చేయనున్నారు. 2019లో 50 సీట్లు, 2020లో 62 వైద్య సీట్లు భర్తీ చేశారు. ఈసారి వంద సీట్ల భర్తీకి శ్రీకారం చుట్టారు. కొత్తగా ప్రారంభించిన ఆపరేషన్ థియేటర్‌లో రెండు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు.
సిద్ధమైన శస్త్రచికిత్స గది
రూ. 1,028 కోట్లతో పనులు
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1,028 కోట్లలో రూ.800 కోట్లను నిర్మాణ పనులకు, రూ.183 కోట్లు వైద్య పరికరాల కొనుగోలు, మిగతా రూ.45 కోట్లు ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించారు. 201 ఎకరాల్లో ఆసుపత్రి భవనాలు, 28 అంతస్తులతో మూడు టవర్లు (వసతి గృహాలు) వైద్య కళాశాల, ఆయుష్ భవనం, ఈత కొలనులు, పచ్చదనం, అతిథి గృహాలు, ఆడిటోరియం, వసతి గృహాలు, విశాలమైన పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
భువనగిరిలో సేవలు