తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్యక్రియల కోసం ఆదివారం ఉదయం 9 గంటలకు ఆసుపత్రి నుంచి 108 వాహనంలో పంపించారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు నగరంలోనే ఉండటం వల్ల వారంతా కలిసి మృతదేహాన్ని కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం సమీపాన శ్మశానవాటిక స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలను జరిపేందుకు 108 వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో కుటుంబ సభ్యులు వెళ్లారు.
విషయం తెలుసుకున్న స్థానికులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో జలాశయం ఉన్నందున ఇక్కడ నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని అభ్యంతరం తెలిపారు. సర్ది చెప్పినా వినకపోవడం వల్ల 108 వాహనంతో పాటు వారి వెంట వచ్చిన బంధువులు తీగల వంతెన సమీపాన గల శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.