అమరాతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మొదటి దశలో ప్రాధాన్యతా క్రమంలో మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ పథకం కింద చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది. ఏఎంఆర్డీఏ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు గానూ..బ్యాంకు రుణాల కోసం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆంగీకరించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ. 3 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలను తెచ్చుకునేందుకు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి అనుమతినిస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులు వెయ్యి కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఏఎంఆర్డీఏ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. దీనికి అనుమతినిచ్చిన ప్రభుత్వం ఈ రుణంతో పాటు, వడ్డీని కూడా అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీనే చెల్లించుకోవాలని షరతుల్లో పేర్కోంది. ఏఎంఆర్డీఏ పరిధిలో రూ. 4,377 కోట్ల మేర రహదారులు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి, రూ. 6,715 కోట్లు ఎల్ పీఎస్ లే అవుట్లకు అవసరమని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో మూడు విడతలుగా రూ.11,092 కోట్ల మేర ఖర్చు చేయాలని నిర్ణయించారు. తొలివిడతగా ముూడు వేల కోట్ల బ్యాంకు రుణంతో మౌలిక వసతుల నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.