ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రక్షణకు హద్దులు లేవు.. జీరో ఎఫ్​ఐఆర్​ ఉందిగా..! - police rules about zero fir

‘‘సార్‌ మావాళ్లు ప్రమాదంలో చిక్కుకున్నారు... వారిని రక్షించరూ’’ అంటూ పోలీసులను ఆశ్రయిస్తే.. ఆ స్థలం తమ పరిధిలోకి రాదనో.. లేదా ఫలానా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదివ్వండనో వచ్చే సమాధానాలు చాలామందికి అనుభవమే. తాజాగా హైదరాబాద్‌ శివార్లలో హత్యాచారానికి గురైన యువతి ఆపదలో ఉన్నట్లు తెలిసి ఆమె సోదరి ఫిర్యాదివ్వటానికి వెళ్లినప్పుడూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆపత్కాలంలో పోలీసులకు చెబితే ఆదుకుంటారనే భావనే తప్ప.. రక్షణకు ఈ హద్దుల గోలేంటో ఎవరికీ అర్థంకాదు. ఇలాంటివాటన్నింటికీ సమాధానమే ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’. చట్టంలోనే దీనికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ అంటే ఏమిటో, దాని ఉపయోగమేంటో తెలుసుకుందాం.

రక్షణకు హద్దులు లేవు.. జీరో ఎఫ్​ఐఆర్​ ఉందిగా..!
రక్షణకు హద్దులు లేవు.. జీరో ఎఫ్​ఐఆర్​ ఉందిగా..!

By

Published : Dec 1, 2019, 9:05 AM IST

ఏదైనా అత్యవసర సమయంలో తమకు సహాయం చేయమని పోలీస్​ స్టేషన్​కు వెళ్లినప్పుడు అది తమ పరిధి కాదని చెప్పి పోలీసులు తప్పించుకోవడానికి వీలులేదు. ఫిర్యాదు అందితే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని జీరో ఎఫ్​ఐఆర్​ చెబుతుంది. చట్టంలోనే దీనికి అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు.

జీరో ఎఫ్​ఐఆర్​ అంటే..?

నేరఘటన స్థలం తమ పోలీసుస్టేషన్‌ భౌగోళిక పరిధిలోకి రాదని తెలిసినా సరే.. ఫిర్యాదు అందితే అత్యవసర పరిస్థితుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించాల్సిందే. తర్వాత సంబంధిత పోలీసుస్టేషన్‌కు ఎఫ్‌ఐఆర్‌ను బదిలీచేయాలి. తొలుత ఏ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అందిందో.. అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు వరుససంఖ్య కేటాయించరు. దీన్ని ఆ స్టేషన్‌ రికార్డుల్లో జీరోగా చూపిస్తారు. దీన్నే జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటారు. కేసు బదిలీ అయిన పోలీసుస్టేషన్‌ రికార్డుల్లో ఎఫ్‌ఐఆర్‌కు వరుస సంఖ్యను కేటాయిస్తారు. ఎక్కడైనా, ఏదైనా నేరం జరిగిందని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అందితే తప్పనిసరిగా కేసు నమోదుచేయాలి. నేరం జరిగిన ప్రదేశం తమ పోలీసుస్టేషన్‌ భౌగోళిక పరిధిలోకి వస్తుందా.. రాదా? అనే సందేహమున్నా సరే తొలుత ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించాలి. తర్వాత నేరం జరిగిన ప్రదేశం తమ పరిధి కాదని తేలితే.. అది ఏ పోలీసుస్టేషన్‌ పరిధిలోకి వస్తుందో చూసి.. అక్కడికి ఎఫ్‌ఐఆర్‌ బదిలీచేయాలి. నేరం జరిగినప్పుడు బాధితులను రక్షించే క్రమంలో పరిధుల పేరిట జాప్యం జరగకూడదని, ఆ జాప్యం వల్ల నేరగాళ్లు తప్పించుకునేందుకు అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫిర్యాదు తీసుకోకుంటే

ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తే అది నేరమవుతుంది. ఐపీసీ సెక్షన్‌ 166ఏ ప్రకారం ఆ పోలీసు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవొచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌ విషయంలో సత్వరం స్పందించే పోలీసు అధికారులను రివార్డులతో సత్కరించాలని.. నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తీసుకోవాలని 2013లోనే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

ఇదీ చూడండి:

పశువైద్యురాలి హత్యోదంతంపై ఆగ్రహ జ్వాల

ABOUT THE AUTHOR

...view details