Industry representatives on Power Holiday: 'మీరు చెప్పినట్లు 50 శాతం విద్యుత్తుతో పరిశ్రమలు నడిపితే.. వాటికి తాళాలు కొని వేయడానికి కూడా మా వద్ద డబ్బులుండవు. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు కుదేలయ్యాం. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంతలో పవర్ హాలిడే, విద్యుత్తు ఆంక్షలు విధించడం అన్యాయం. ప్రభుత్వ నిర్ణయం పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2014 ముందు పరిస్థితులు మళ్లీ ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఆక్వా, స్టీల్, సిమెంటు పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి' అని పలు పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యవేక్షక ఇంజినీర్ శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన విజయవాడలో శుక్రవారం జరిగిన వినియోగదారుల సమావేశంలో వీరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి సమాధానమిస్తూ.. ఎప్పటికప్పుడు విద్యుత్తుపై సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని, ఈ నెలాఖరు నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలు ఉన్నాయని, ఇది తాత్కాలికమేనని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Industry representatives on Power Holiday: సమావేశంలో పారిశ్రామికవేత్తలు బాయన వెంకట్రావు, కె.సోమిరెడ్డి, ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్ సభ్యులు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పరిశ్రమల ప్రతినిధులు ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్‌ను కలిసి పవర్ హాలిడే వల్ల ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలకు కోతలు విధించాల్సి వస్తోందని ఎండీ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సంక్షోభమని, త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.