ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''నిర్మాణాలకు నోటీసులతో.. లక్షల మందిలో నిరాశ''

అమరావతిలో కరకట్టపై ఉన్న నిర్మాణాలు అక్రమమని.. వాటిని కూల్చేస్తామని సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసులపై పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్.. అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం జగన్​కు లేఖ రాశారు. కూల్చివేత ప్రక్రియ రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశా నిస్పృహల్లోకి నెట్టేస్తోందన్నారు.

By

Published : Sep 24, 2019, 9:52 PM IST

Updated : Sep 24, 2019, 10:52 PM IST

సీఎం జగన్​కు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్​ లేఖ

''నిర్మాణాలకు నోటీసులతో.. లక్షల మందిలో నిరాశ''

సీఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపడుతోన్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశానిస్పృహల్లోకి నెట్టేస్తుందని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్​ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కూల్చివేతల వల్ల తన ఒక్క కుటుంబం మాత్రమే ప్రభావితం కాదన్న విషయాన్ని గమనించాలని కోరారు. అమరావతి పరిధిలోని కరకట్టపై మొదలైన ప్రక్రియ వేర్వేరు కారణాలతో తమ ప్రాంతానికి వస్తుందనే ఆందోళనలో ప్రజలున్నారని తన ఐదు పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ప్రస్తుత చంద్రబాబు నివాసాన్ని నిబంధనలు మేరకు అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మించామని వివరించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ, పాలన పటిష్ఠంగా ఉండి పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు.

సీఎంగా ఎవరున్నా అలానే స్పందిస్తా

విభజన అనంతరం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని లింగమనేని గుర్తు చేశారు. విజయవాడ, కృష్ణా పరివాహక ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నాక... ఇక్కడి నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కరకట్టపై ఉన్న అతిథి గృహాన్ని సీఎం అధికారిక నివాసానికి కేటాయించాలని అధికారులు కోరగానే ఇచ్చానని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత లాభాలు లేవని స్పష్టం చేశారు. ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మరే నాయకుడు సీఎంగా ఉన్నా అదే రీతిలో స్పందించేవాడినని పేర్కొన్నారు. కరకట్టపైన ఉన్న నిర్మాణానికి అనుమతులు లేవంటూ సీఆర్డీఏ అధికారులు కూల్చివేత తాఖీదులు ఇవ్వడాన్ని లింగమనేని తప్పుబట్టారు. ప్రభుత్వ విధానాల్లో మార్పులు, విభజన సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు వీటన్నిటినీ తట్టుకొని మరీ రాష్ట్రం ఎదిగే దశలో ఉన్న విషయాన్ని దయచేసి గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

'ఇసుక రేటు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?'

Last Updated : Sep 24, 2019, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details