ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా కేసులో కొత్త మలుపు... క్రిమినల్‌ చర్యలకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశం - కంపెనీ లా ట్రైబ్యునల్‌

Indu Projects Bankruptcy Case: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించి కంపెనీని దక్కించుకున్న ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ గడువులోగా సొమ్ము చెల్లించకపోవడంతో ఆ ప్రణాళికను రద్దు చేస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Indu Projects Bankruptcy Case
Indu Projects Bankruptcy Case

By

Published : Mar 3, 2022, 5:28 AM IST

Indu Projects Bankruptcy Case: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించి కంపెనీని దక్కించుకున్న ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ గడువులోగా సొమ్ము చెల్లించకపోవడంతో ఆ ప్రణాళికను రద్దు చేస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా రుణ పరిష్కార ప్రణాళికకు భిన్నంగా వ్యవహరించినందుకు ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌, కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌లపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జనవరి 23 నుంచి మరో 60 రోజులపాటు గడువు పొడిగించాలన్న ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ దరఖాస్తును కొట్టివేసింది. ఇప్పటికే ఈఎండీ కింద చెల్లించిన రూ.5 కోట్ల బ్యాంకు గ్యారంటీని జప్తు చేయాలని రుణ పరిష్కార నిపుణుడి(ఆర్‌పీ)కి ఆదేశించింది. ఈమేరకు ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్‌ సభ్యులు బి.పి.మోహన్‌, సాంకేతిక సభ్యులు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ సిన్హాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందూ ప్రాజెక్ట్స్‌ 12 బ్యాంకులకు రూ.2893.19 కోట్లు బకాయి పడటంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించగా దివాలా పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ 2020 సంవత్సరంలో ఆదేశాలు జారీ చేసింది.

రుజువైతే ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష..

రూ.501 కోట్లతోపాటు రూ.77.59 కోట్లు కౌంటర్‌ గ్యారంటీ, రూ.40 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద పెట్టుబడులుగా పెట్టడానికి ముందుకు వచ్చిన ఎర్తిన్‌, కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ కంపెనీలు సమర్పించిన ప్రణాళికను గత ఏడాది అక్టోబరులో ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. దీన్ని అమలు చేయడానికి 90 రోజులు గడువు కోరడంతో ఆర్‌పీతోపాటు పర్యవేక్షక కమిటీ అనుమతించాయి. గడువులోగా సొమ్ము చెల్లించలేదని వీరు ఎన్‌సీఎల్‌టీ దృష్టికి తీసుకురాకపోవడంలో వారి పారదర్శకతపై అనుమానాలు వ్యక్తంచేసింది. జనవరి 23లోగా సొమ్ము చెల్లిస్తానని, గడువు తీసుకున్నప్పటికీ సొమ్ము చెల్లించకపోగా మరో 60 రోజులు గడువు కావాలని ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ దాఖలు చేసిన దరఖాస్తును అనుమతించలేమంది. ఎర్తిన్‌ తదితరులు సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికను రద్దు చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాలని రుణదాతల కమిటీకి ఆదేశించింది. రుణ పరిష్కార ప్రణాళికతోపాటు సమర్పించిన రూ.5 కోట్లు బ్యాంకు గ్యారంటీని జప్తు చేయాలని ఆర్‌పీని ఆదేశించింది. ప్రణాళికకు విరుద్ధంగా వ్యవహరించినందున క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ చేపట్టాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐబీబీఐ క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ చేపట్టనుంది. ఇది రుజువైతే ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష నుంచి కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:వై.ఎస్. వివేకాను కొట్టి... ఆ లేఖ రాయించారు: సీబీఐ

ABOUT THE AUTHOR

...view details