ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PG EDUCATION: పీజీ చదువుపై.. ‘ప్రైవేటు’ ఫీజు ప్రభావం! - ఏపీ తాజా వార్తలు

పీజీ కోర్సుల్లో చేరే విద్యార్ధుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఫీజులు కట్టలేకే విద్యార్ధులు వెనకడుగు వేస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. దీంతో ప్రవేశ పరీక్షల దరఖాస్తులు భారీగా తగ్గుతున్నాయి.

PG education
PG education

By

Published : Aug 18, 2021, 7:40 AM IST

పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ ఏడాది పీజీ కోర్సులకు వస్తున్న దరఖాస్తుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు కళాశాలల్లోని పీజీ కోర్సులకు బోధనా రుసుములను ప్రభుత్వం చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు పూర్తిగా రుసుములను చెల్లిస్తున్న ప్రభుత్వం.. గతేడాది నుంచి ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు బోధనా రుసుముల చెల్లింపు నిలిపేసింది. దీంతో సొంతంగా ఫీజులు చెల్లించి ఉన్నత విద్య చదివే వారి సంఖ్య తగ్గుతోంది. చదువు, వసతికి అయ్యే వ్యయాన్ని భరించలేక కొందరు పేదలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో చేరిన వారికి మాత్రమే బోధన రుసుముల చెల్లింపు, వసతి దీవెనను ప్రభుత్వం అమలు చేస్తోంది.

కనిపించని స్పందన

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌కు గతేడాది 64,884 మంది దరఖాస్తు చేయగా 51,991 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 29,338 మంది ప్రవేశాలు పొందారు. ఈసారి 40,324 దరఖాస్తులే వచ్చాయి. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు 14వ తేదీతో ముగిసింది. గతేడాదితో పోలిస్తే 24,560 దరఖాస్తులు తగ్గాయి. ప్రవేశాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడనుంది. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకే అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంటెక్‌, ఎంఫార్మసీ ప్రవేశాలకు పీజీఈసెట్‌ నిర్వహిస్తున్నారు.

గతేడాది 28,868 మంది దరఖాస్తు చేయగా.. 22,911 మంది పరీక్ష రాశారు. వీరిలో 8,108 మంది చేరారు. దరఖాస్తుకు గడువు సమయం దగ్గరపడుతున్నా ఇప్పటివరకూ 5,541 మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గత నెల 19న ప్రారంభం కాగా.. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఈ నెల 19తో ముగియనుంది. ప్రస్తుతం వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే ఏడు వేలకు మించే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఈ లెక్కన ప్రవేశ పరీక్ష రాసేవారి సంఖ్య, ప్రవేశాలు మరింత తగ్గిపోనున్నాయని విశ్లేషిస్తున్నారు.

ఫీజుల భారం..

ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సుల్లో చేరే వారికి బోధనా రుసుములను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఫీజులు భారంగా మారుతున్నాయి. కళాశాల ఫీజుతోపాటు వసతి గృహం ఖర్చులు, ఇతరŸ వ్యయాలను భరించలేక చాలా మంది అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ)తోనే చదువు ఆపేస్తున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఎంబీఏ కోర్సుకు ఏడాదికి రూ.27వేల నుంచి రూ.66వేల వరకు ఫీజులు ఉన్నాయి. ఎంసీఏకి రూ.27వేల నుంచి రూ.70వేలు, ఎంటెక్‌కు రూ.35వేల నుంచి రూ.70వేలు, ఎంఫార్మసీకి రూ.50వేల నుంచి 70వేల వరకు ఫీజులు ఉన్నాయి.

ఇదీ చదవండి:

తెలంగాణ, ఏపీలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా

ABOUT THE AUTHOR

...view details