ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ISB Online Course: గుడ్‌న్యూస్.. రూ.2,360కే ఐఎస్‌బీ కోర్సు - ఐఎస్‌బీ కోర్సు ఫీజు

ISB Online Course: ఇండియన్ బిజినెస్ స్కూల్‌(ఐఎస్‌బీ)లో కోర్సు చేయాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. కానీ అక్కడ పోటీ ఎక్కువ. ఫీజులు కూడా భారీగానే ఉంటాయి. అందుకే చాలా మంది వెనకడుగేస్తుంటారు. అలాంటి వారికి ఐఎస్‌బీ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. కేవలం రూ.2,360లతోనే ఐఎస్‌బీలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్‌ కోర్సులను అందించేందుకు ఇటీవల ఎస్‌బీటెట్‌ అధికారులు ఐఎస్‌బీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ISB Online Course
గుడ్‌న్యూస్... రూ.2,360కే ఐఎస్‌బీ కోర్సు

By

Published : Mar 19, 2022, 8:37 AM IST

ISB Online Course: ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌(ఐఎస్‌బీ) నుంచి ఏదైనా కోర్సు చేయాలనుకునే ఔత్సాహికులకు శుభవార్త. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) ఆ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా ఐఎస్‌బీలో చదవాలంటే తీవ్ర పోటీతో పాటు ఫీజులూ భారీగా ఉంటాయి. ఇప్పుడు కేవలం రూ.2,360లతోనే అందులో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయవచ్చు. డిగ్రీ విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువతా ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఆన్‌లైన్‌ కోర్సులను అందించేందుకు ఇటీవల ఎస్‌బీటెట్‌ అధికారులు ఐఎస్‌బీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అదనపు నైపుణ్యాలు ఉండటం యువతకు ఉద్యోగాన్వేషణలో కచ్చితంగా అదనపు అర్హత అవుతుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరేందుకూ ఈ కోర్సులు దోహదపడతాయి. ఐఎస్‌బీలో నిపుణులైన సిబ్బంది ఉండటంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. అక్కడి ఆచార్యులు పాఠాలు బోధిస్తారు. శిక్షణ పూర్తయ్యాక పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైతే ఎస్‌బీటెట్‌ నుంచి సర్టిఫికెట్‌ జారీచేస్తారు. ఎస్‌బీటెట్‌ ప్రభుత్వ విభాగమైనందున ఆ ధ్రువపత్రాలకు ఎక్కడైనా గుర్తింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రవేశాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కొద్దిరోజుల్లో అధికారులు వెల్లడించనున్నారు. పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, డిగ్రీ తదితర కళాశాలల్లో ఈ కోర్సులపై ప్రచారం చేయనున్నారు. ఈ ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తిచేస్తే వాటి క్రెడిట్లను పరిగణనలోకి తీసుకుంటామని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) కూడా ప్రకటించిందని అధికారులు చెబుతున్నారు.

ఏం నేర్పుతారంటే..

  • నాలుగు కోర్సులకు సిలబస్‌ను ఐఎస్‌బీ నిపుణులే రూపొందించారు. ఒక్కో కోర్సును 40 గంటలపాటు బోధిస్తారు.
  • బిజినెస్‌ లిటరసీ కోర్సులో అకౌంటింగ్‌ ఫండమెంటల్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా ఎనలిటిక్స్‌, క్రిటికల్‌ థింకింగ్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, నెగోసియేషన్‌ ఎనాలిసిస్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ తదితర 13 అంశాలపై బోధిస్తారు.
  • బిహేవియరల్‌ స్కిల్స్‌ కోర్సులో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మైండ్‌సెట్‌, ఆర్ట్‌ ఆఫ్‌ నెట్‌వర్కింగ్‌, టెక్నాలజీ ఫండమెంటల్స్‌, ఆర్ట్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌ తదితర అంశాలుంటాయి.
  • డిజిటల్‌ లిటరసీ కోర్సులో కృత్రిమ మేధ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, డేటా సైన్స్‌ లాంటి డిజిటల్‌ సాంకేతికతపై శిక్షణ ఉంటుంది.
  • ఎంటర్‌ప్రెన్యూరియల్‌ లిటరసీలో స్టార్టప్‌ డెవలప్‌మెంట్‌, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌, పెట్టుబడుల సాధన, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలను బోధిస్తారు.

కోర్సుల వివరాలు..
కోర్సుల పేర్లు: 1.బిజినెస్‌ లిటరసీ ప్రోగ్రామ్‌ 2. డిజిటల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌ 3. ఎంటర్‌ప్రెన్యూరియల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌ 4. బిహేవియరల్‌ స్కిల్స్‌ ప్రోగ్రామ్‌

  • శిక్షణ: 40 గంటలు ఆన్‌లైన్‌లో (అభ్యర్థులు 3 నెలలలోపు ఈ శిక్షణ పూర్తి చేయవచ్చు)
  • ఫీజు: రూ.2,360
  • సీట్లు: ఆన్‌లైన్‌ కోర్సులు.. పరిమితి లేదు.
  • మొదటి విడత: బిజినెస్‌ లిటరసీ, బిహేవియరల్‌ స్కిల్స్‌ కోర్సులు అందిస్తారు. ఈనెల 31 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్‌ 15 నుంచి కోర్సు ప్రారంభం. రెండో విడతలో మిగిలిన రెండు కోర్సులు మే 15న ప్రారంభమవుతాయి.

ABOUT THE AUTHOR

...view details