చైనాలో కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలోని పట్టుకు డిమాండ్ పెరిగింది. చైనాలోని కరోనాకు.. మన రాష్ట్రంలోని పట్టుకు సంబంధం ఏమిటనుకుంటున్నారా?... చైనా సిల్క్.. స్వదేశీ పట్టుకు పోటీగా దిగుమతి అయ్యేది. నాణ్యత బాగుండి ధరల్లోనూ వ్యత్యాసం ఉన్న కారణంగా.. జాతీయ మార్కెట్‌లో మన పట్టుకు డిమాండ్ తగ్గి రేట్లు అంతంత మాత్రంగానే ఉండేవి. కరోనా వైరస్ ప్రభావంతో చైనా సిల్క్ ఒక్కసారిగా ఆగింది. స్వదేశీపట్టుకు డిమాండ్ ఏర్పడి.. పట్టుగూళ్ల ధరలు ఊపందుకొన్నాయి.
కళకళలాడుతున్న హిందూపురం మార్కెట్
మార్కెట్‌లో కిలో బైవోల్టిన్ రూ.400-500 మధ్య ఉండే పట్టుగూళ్ల ధరలు.. ఒక్కసారిగా రూ.113 పెరిగాయి. ప్రస్తుతం కిలోకు రూ.613కు ధర చేరింది. ఫలితంగా.. రైతులు, రీలర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అనంతపురం జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ అగ్రగామి. ఇక్కడికి నిత్యం 3-4 టన్నుల పట్టుగూళ్లు వచ్చేవి. ప్రస్తుతం 6 టన్నులు వస్తున్నాయి.