తెలంగాణలో పెరిగిన ధరలతో ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఇందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పెంచిన మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చాయి. నిన్న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన.. 3 ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు.. స్టాంపు డ్యూటీ పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు రూ.75 వేల రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం.. స్లాబుల వారీగా 50, 40, 30 శాతం లెక్కన 3 స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను పెంచింది.
అదే విధంగా ఓపెన్ ఫ్లాట్ల చదరపు గజం కనీస ధర 100 నుంచి 200 రూపాయలకు పెంచిన ప్రభుత్వం.. స్లాబుల వారీగా తక్కువ ధర కలిగిన వాటిపై 50 శాతం.. మధ్య రకం విలువలు కలిగిన వాటిపై 40 శాతం, ఎక్కువ విలువలు కలిగిన వాటిపై 30 శాతం లెక్కన 3 స్లాబుల్లో పెంచినట్లు స్పష్టం చేసింది.
ఒక్క బటన్ నొక్కగానే.. విలువలు అప్డేట్..
అపార్ట్మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు.. కనీస విలువ 800 నుంచి వెయ్యి రూపాయలకు పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20, 30 శాతం లెక్కన రెండు స్లాబులు పెంచినట్లు వెల్లడించింది. ప్రాంతాల వారీగా, గ్రామాలు, పట్టణాలు వారీగా పెంచిన మార్కెట్ విలువలు.. ఇప్పటికే అప్డేట్ అయ్యాయి. పెంపునకు సంబంధించి సాఫ్ట్వేర్ ముందే సిద్ధం చేసి పెట్టుకోవడంతో ఒక్క బటన్ నొక్కగానే ఆటోమెటిక్‌గా విలువలు అప్డేట్ అయ్యాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.