కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులపై ఆధారపడిన రైతులకు శుభవార్త. ఆలమట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం పెరిగింది. ఇదే ప్రవాహం కొనసాగితే అయిదారు రోజుల్లో ఆలమట్టి నుంచి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం ఆలమట్టిలోకి 72వేల క్యూసెక్కులు, తుంగభద్రలోకి 26వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ప్రస్తుతం ఆలమట్టిలో 90 టీఎంసీల నీరు ఉంది. మరో 40 టీఎంసీలు వస్తే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ఆలమట్టి నుంచి దిగువన ఉన్న నారాయణపూర్‌కు 16,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిండటానికి కూడా మరో పది టీఎంసీలు మాత్రమే అవసరం. మొత్తమ్మీద ఈ రెండు ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటినిల్వకు 50 టీఎంసీలు కావాలి. అయితే 40 టీఎంసీలు వస్తే దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి వరద సమయంలో రిజర్వాయర్ నిండా నీటిని నిల్వ ఉంచే అవకాశం లేనందున అయిదారు రోజుల్లో దిగువకు వదులుతారని నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ఇప్పటికే 7.61 టీఎంసీల నీరు ఉంది. 1700 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దీంతో 1400 క్యూసెక్కుల నీటిని జూరాలతో పాటు నెట్టెంపాడు కాలువలకు విడుదల చేశారు. తుంగభద్రలోకి 26వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఈ ప్రాజెక్టు నిండటానికి ఇంకా 80 టీఎంసీలకు పైగా అవసరం. శ్రీశైలంలోకి మూడువేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, సాగర్‌లోకి ఏమీ లేదు. ఈ రెండు ప్రాజెక్టులకు 320 టీఎంసీలు అవసరం.
గోదావరి ప్రాజెక్టుల్లో నామమాత్ర ప్రవాహం