నిత్యావసర వస్తువుల ధరల్లో క్రమేపీ పెరుగుదల నమోదవుతోంది. లాక్‌డౌన్ ముందు.. తర్వాత అని బేరీజు వేసి చూస్తే తేడా స్పష్టంగా కళ్లకు కడుతోంది. దాదాపు 30 శాతం వరకు పెరుగుదల ఉంది. ముఖ్యంగా పప్పుదినుసులు, చింతపండు, నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆంక్షలతో సరకుల రవాణాలో అవాంతరాలు కొంత కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం ఈ పరిస్థితులను అధిగమించేందుకు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
ధర ఎక్కువనిపిస్తే ఫోన్ చేయండి..
కొనే నిత్యావసర వస్తువు ధర గతంతో పోలిస్తే పెరిగిందా.. అంత ధర పెట్టి కొనొచ్చా.. లేక మోసపోతున్నామా.. ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు పౌరసరఫరాల శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 040-23336116 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. లేదా 7330774444 నంబరుకు వాట్సప్ చేసి అధిక ధరలపై సందేహాలు అడగొచ్చు. ఫిర్యాదులు చేయొచ్చు. హైదరాబాద్‌లో అయితే చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్‌వో)కు 040-23447770కు ఫోన్ చేయొచ్చు.
24 గంటల పాటు ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పౌరసరఫరాల అధికారులు 24 నిత్యావసర వస్తువుల ధరలను రోజూ సేకరిస్తారు. ధర పెరిగితే ఎందుకు పెరిగింది? ఎంత పెరిగింది? అనే వివరాలన్నీ వారి వద్ద ఉంటాయి. దీని ద్వారా ఏ జిల్లాలో ఏ వస్తువుకు ఎంత ధర ఉందో అధికారులకు తెలుస్తుంది. వినియోగదారులు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఎంతకు అమ్ముతున్నారో తెలుసుకొని, అధిక ధరకు విక్రయిస్తున్నట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటారు. మార్కెట్‌లో ప్రస్తుతం పెరిగిన ధరలపై పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ మల్లిక్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా పరిశీలించి చర్యలకు సిఫార్సు చేస్తామని చెప్పారు.