ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్రకటిత విద్యుత్‌ కోతలు... ఇన్వర్టర్లకు పెరిగిన గిరాకీ

వేసవిలో సాధారణంగా ఏసీలు, కూలర్ల అమ్మకాలు పెరుగుతాయి. దీనికి భిన్నంగా ఈ దఫా మార్కెట్‌లో ఇన్వర్టర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. అసలే వేసవి కాలం ఆపై అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తుండడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని చాలామంది ఇన్వర్టర్లు కొంటున్నారు. దీంతో వారం, పది రోజుల్లోనే అమ్మకాలు పెరిగిపోయాయి.

power cuts
power cuts

By

Published : Apr 18, 2022, 5:11 AM IST

వేసవి వస్తే ఏసీలు, కూలర్ల అమ్మకాలు బాగా పెరుగుతుంటాయి. దీనికి భిన్నంగా ఈ దఫా మార్కెట్‌లో ఇన్వర్టర్ల కొనుగోళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. అసలు విద్యుత్తు ఉండి.. ఫ్యాన్‌ తిరిగితే చాలు ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆలోచనకు చాలా మంది రావడమే ఇందుకు కారణం. ఎనిమిదేళ్ల నుంచి విద్యుత్తు కోతలు లేకపోవడంతో, వీటి గురించి ప్రజలు మర్చిపోయారు. హఠాత్తుగా ఈ వేసవిలో కోతలు విధిస్తుండడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని చాలామంది ఇన్వర్టర్లు కొంటున్నారు. దీంతో వారం, పది రోజుల్లోనే అమ్మకాలు పెరిగిపోయాయి. 2014 తర్వాత పల్లెలకూ నిరంతర విద్యుత్తు అందుబాటులోకి రావడంతో ఇన్వర్టర్లతో పనిలేకుండా పోయింది.

ఇన్నాళ్లకు వీటి అవసరం వచ్చింది. ఇటీవలి వరకు పల్లెల్లో 6 నుంచి 8 గంటలు కోతలు ఉండేవి. ఇప్పుడు 2నుంచి 4 గంటలు కరెంటు పోతోంది. ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతకు తోడు దోమల మోతతో అల్లాడిపోతున్నారు. దీంతో ఇప్పటికే ఇన్వర్టర్లు ఉండి, పక్కనపెట్టిన వారు ఆగమేఘాలపై మరమ్మతులు చేయించి వాడుకలోకి తీసుకొస్తున్నారు.

* కొవిడ్‌ కారణంగా వరుసగా రెండేళ్ల పాటు అమ్మకాలు లేవు. దీంతో విక్రేతలు నిల్వలు పెద్దగా ఉంచుకోలేదు. అప్రకటిత కోతలు రావడంతో వీరి వద్ద ఉన్న నిల్వలు అయిపోయాయి. దీంతో తెలంగాణలోని డీలర్ల నుంచి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని విజయవాడకు చెందిన డీలరు లెనిన్‌రెడ్డి చెబుతున్నారు. బ్యాటరీలకు గిరాకీ బాగా ఉందని అంటున్నారు. గతంలో నెలకు 10 నుంచి 15 వరకు అమ్ముడుపోయేవని, ఇప్పుడురోజుకు 20 వరకు విక్రయిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా గ్రామీణులు ఎక్కువగా కొంటున్నారు.

* గతంలో ఇన్వర్టరు, బ్యాటరీ కలిపి నెలకు వంద సెట్ల వరకు అమ్మేవాడినని, ఈసారి అనూహ్యంగా 400 నుంచి 500 వరకు వెళ్లాయని విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన వ్యాపారి సుబ్బారావు చెబుతున్నారు. ఒక్క సీజన్‌లోనే గత నష్టాలను అధిగమించామని వివరించారు.

డిమాండ్‌తో పెరిగిన ధరలు
ఊహించని విధంగా గిరాకీ పెరగడంతో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్న స్టాకు అయిపోయింది. దీంతో ఉన్న వాటిని దాదాపు 5 నుంచి 10 శాతం ధరలు పెంచి అమ్ముతున్నారు. డిమాండ్‌ పెరగడం.. తెలంగాణలో కోతలు లేకపోవడంతో అక్కడి నుంచి తెప్పించి కంపెనీలు సర్దుతున్నాయి.

ఇదీ చదవండి:ఆ సీఎం బంపర్​ ఆఫర్​.. కరెంట్​ 300 యూనిట్లు ఫ్రీ

ABOUT THE AUTHOR

...view details