వంట నూనెల ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. గతేడాది చివరి నుంచి మొదలైన నూనెల మంటలు ఇంకా చల్లారలేదు. రబీలో వేసిన వేరుసెనగ విక్రయాలు పూర్తి కావొస్తున్నాయి. నూనె ధర మాత్రం మండుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో లీటరు వేరుసెనగ నూనె రూ.175, పామోలిన్ రూ.130పైనే విక్రయిస్తున్నారు. పప్పుల ధరలు కూడా చురుక్కుమనిపిస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారుడిపై భారం మోపుతున్నాయి. కొత్త పంట రాకతో ఉల్లి ధరలు దిగిరావడం కాస్త ఉపశమనాన్నిస్తోంది.
గతేడాదితో పోలిస్తే వంట నూనెల ధరలు 30% నుంచి 65% వరకు పెరిగాయి. లీటరు పొద్దుతిరుగుడు నూనెపై రూ.65, పామోలిన్‌పై ఏకంగా రూ.45 వరకు పెరిగింది. మలేసియా, ఇండోనేసియా తదితర దేశాల నుంచి పామోలిన్ దిగుమతి అవుతుంది. దేశీయంగా జరిగే మొత్తం వంటనూనెల వినియోగంలో 70% మేర దిగుమతులపైనే ఆధారపడటంతో ధరలు తగ్గడం లేదని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. పొద్దుతిరుగుడు నూనె ధరలు కూడా 7% పెరిగాయి.
పప్పుధాన్యాలు తక్కువ.. పప్పుల ధర ఎక్కువ
క్వింటా కందుల ధర రూ.6వేలలోపే పలుకుతోంది. అదే కందిపప్పు ధర మాత్రం మార్కెట్లో కిలో రూ.110 నుంచి రూ.120 మధ్య ఉంది. హోల్‌సేల్ వ్యాపారులు కిలో రూ.85 చొప్పున విక్రయిస్తున్నారు. ఇది చిల్లర వ్యాపారులకు, అక్కడినుంచి వినియోగదారుడికి అందేసరికి కిలోకు రూ.25 నుంచి రూ.35 వరకు ఎక్కువ ఉంటోంది. ఏడాది కిందటితో పోలిస్తే కందిపప్పు ధర కిలోకు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగింది. మినుములు కిలో రూ.6వేల నుంచి రూ.6,500 మధ్య రైతులనుంచి కొంటుంటే, మార్కెట్‌లో మినపగుళ్లు కిలో రూ.125 నుంచి రూ.135కు విక్రయిస్తున్నారు. సెనగపప్పు ధర కిలో రూ.72 వరకుంది.
దిగొచ్చిన ఉల్లి