రాష్ట్రంలో ఉల్లి ధర అంతకంతకూ పెరుగుతోంది. రైతుబజార్లలో కిలో రూ.36 చొప్పున పలుకుతుంటే బయట మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. వినియోగదారుల కష్టాలిలా ఉంటే.. మరోవైపు పండించిన ఉల్లిని అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు యార్డుకు వస్తే నాలుగైదు రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఈనెల 11 దాకా సరుకు తేవద్దని.. అవసరమైతే తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్ముకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉల్లి దిగుమతుల దిశగా ..
మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి సాగు భారీగా దెబ్బతింది. కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ సరకు మార్కెట్‌కు వస్తోంది. ధరలు కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్రం ఉల్లి దిగుమతులపై దృష్టి పెట్టింది. ఈజిప్టు, టర్కీ, ఇరాన్ నుంచి తెప్పించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ ఉల్లి మార్కెట్‌లోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఆదివారం నుంచి రైతుబజార్లలో
మార్కెట్‌లో ఉల్లి ధర కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగింది. గతంలో మార్కెటింగ్ శాఖ ద్వారా ఉల్లి తెప్పించి కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా ఆదివారం నుంచి రైతుబజార్లలో ఉల్లి అమ్మకాలకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. కర్నూలు యార్డులో కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.