వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని రకాల వస్త్రాలు, రెడీమెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. వస్త్ర పరిశ్రమపై ఉన్న 5 శాతం విలువ ఆధారిత పన్నుకు అదనంగా మరో 7 శాతం జోడించి.. 12 శాతానికి పెంచనుండటమే దీనికి కారణం. మరోవైపు ప్రస్తుతం రెడీమెడ్ గార్మెంట్స్‌లో ఒక పీస్ ఎమ్మార్పీ వెయ్యి రూపాయల లోపు ఉంటే.. 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఎమ్మార్పీ వెయ్యి రూపాయలు దాటిన వాటిపై 12 శాతం విధిస్తున్నారు. జనవరి 1 నుంచి ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా అన్ని రకాల రెడీమెడ్ దుస్తులపై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. గతంలో జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కొత్త ఏడాది నుంచి అమలు కానుంది. దీని వల్ల ధరలు పెరిగి.. రాష్ట్ర వినియోగదారులపై అదనంగా ఏడాదికి 2 వేల వంద కోట్ల రూపాయల భారం పడనుంది.
కొవిడ్ నుంచి కోలుకుంటున్న దశలో...
శ్రీకాకుళం, విజయనగరం, తుని, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, వెంకటగిరి, ప్రొద్దుటూరు, ధర్మవరం, రాయదుర్గం వస్త్ర రంగానికి కేంద్రాలు. టెక్స్‌టైల్, రెడీమెడ్ గార్మెంట్స్‌రంగంలో 50 వేల పైచిలుకు దుకాణాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.30 వేల కోట్ల వరకు లావాదేవీలు సాగుతున్నాయి. ప్రస్తుతం 5% జీఎస్టీ ప్రకారం... రూ.1,500 కోట్లు వినియోగదారులపై భారం పడుతోంది. అదనంగా పెరిగే 7%తో భారం రూ.2,100 కోట్లను కలుపుకొంటే.. ఇకపై మొత్తం జీఎస్టీ రూ.3,600 కోట్లు కానుంది.
రూ.2 లక్షల వస్త్రాలు కొంటే...
సాధారణంగా పండగలు, పెళ్లిళ్ల సమయంలో అన్ని వర్గాల వారు వస్త్రాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వచ్చే నెలలో సంక్రాంతి రాబోతోంది. ఉదాహరణకు శుభకార్యాల కోసం ఎవరైనా రూ.2 లక్షలు వెచ్చించి వస్త్రాలు కొనుగోలు చేశారనుకుంటే... ప్రస్తుతం రూ.10,000 జీఎస్టీ చెల్లించాలి. కొత్త ఏడాదిలో అదనంగా 7% జీఎస్టీ పెంపుతో రూ.24,000 కట్టాల్సి వస్తుంది.