ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిశ్రమలపై మరో పిడుగు... విద్యుత్‌పై సుంకం పెంపు

రాష్ట్రంలో పరిశ్రమలపై విద్యుత్ సుంకాల రూపంలో మరో పిడుగు పడింది. యూనిట్‌కు 6 పైసల దగ్గర ఉన్న సుంకాన్ని....ప్రభుత్వం రూపాయికి పెంచేసింది. పవర్ హాలిడేతోనే నష్టపోయే పరిస్థితి ఉన్నప్పుడు.....అదనంగా విద్యుత్‌ సుంకం ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

power
power

By

Published : Apr 12, 2022, 5:32 AM IST

వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలు చేసే విద్యుత్‌ సుంకం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం యూనిట్‌కు 6 పైసల చొప్పున వసూలు చేస్తున్న సుంకాన్ని ఏకంగా రూపాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. వాస్తవానికి కొవిడ్‌ సమయంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలు...ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో విద్యుత్‌ కొరతతో అవసరాలకు సరిపడా సరఫరా లేకపోవటం వల్ల పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం అంతరాయం లేకుండా పనిచేసే పరిశ్రమలు వారాంతపు సెలవుతో పాటు అదనంగా మరోరోజు విద్యుత్‌ విరామం అమలు చేయాలి. అంటే వారంలో ఐదు రోజులే పనిచేయాలి. మూడు షిఫ్టుల్లో నడిచే పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ వినియోగించాలి. రెండు షిఫ్టుల్లో పనిచేసే పరిశ్రమలు ఒక షిఫ్టునకు కుదించాలని ఇంధన శాఖ ఆదేశించింది. ఈ నెల 8 నుంచి 22 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఇప్పటికే ముడిసరకు ధరలు పెరిగి, మార్కెట్‌ డిమాండ్‌ లేక ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలపై విద్యుత్‌ విరామంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అదనంగా విద్యుత్‌ సుంకం పేరుతో యూనిట్‌కు 94 పైసలు పెంచుతూ జారీచేసిన ఉత్తర్వులతో మరింత భారం పడనుంది. ఇలాగైతే పరిశ్రమలు మూసేయాల్సిన పరిస్థితి వస్తుందని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు.

ఇటీవల 2022-23 విద్యుత్‌ టారిఫ్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(APERC) ప్రకటించింది. కేటగిరీల మార్పుతో గృహ విద్యుత్‌ వినియోగదారులపై 14 వందల కోట్ల రూపాయల భారం పడింది. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ టారిఫ్‌లో మార్పులు చేయలేదని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ సుంకం పెంపుతో వారిపైనా భారం పడింది. గృహ వినియోగదారుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్నట్లుగానే యూనిట్‌కు 6 పైసల వంతున, వ్యవసాయ విద్యుత్‌కు పూర్తిగా సుంకం మినహాయింపు కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

ఇదీ చదవండి: పరిశ్రమలపై పిడుగు... పవర్‌ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details