రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) పదవీ కాలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టాన్ని సవరించనందున పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలం కొనసాగుతున్నట్లేనా....అని హైకోర్టు సందేహం వెలిబుచ్చింది. తాజాగా సవరించిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎస్‌ఈసీగా మూడేళ్లు.. పురపాలక చట్టం ప్రకారం ఐదేళ్ల పదవీ కాలంతో ఒకే వ్యక్తి ఎలా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. పురపాలక చట్టంలో ఎస్‌ఈసీ నియామకం, పదవీకాల నిబంధనలు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలపై స్పష్టతనివ్వాలని సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావును కోరింది. వాదనల కొనసాగింపునకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది.
తనను ఎస్‌ఈసీగా తొలగించేందుకు ప్రభుత్వం దురుద్దేశంతో ఆర్డినెన్సు తీసుకొచ్చిందంటూ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంతోపాటు ఆర్డినెన్సు, తదనంతర జీవోలను సవాలు చేస్తూ మరో 12 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు ప్రత్యక్షంగా విచారించింది. వ్యాజ్యాలను దాఖలు చేసిన న్యాయవాదులు, వారి తరఫు సీనియర్ న్యాయవాదులు, ప్రతివాదుల తరఫు న్యాయవాదులను మాత్రమే హైకోర్టు అనుమతించింది. వారు దూరం పాటించేలా చూసింది.
ఆర్డినెన్సులో ప్రస్తావించలేదే?