తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంట వద్ద బావిలో తేలిన మృతదేహాల మిస్టరీ మూడు రోజులైనా వీడలేదు. దీంతో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. హత్య కోణంలోనూ విచారిస్తున్నారు. ఈ హత్యలు ఒక్కరే చేశారా? మరికొంత మంది ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. శనివారం స్థానిక పోలీసులతో పాటు, కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) బృందం పరిశీలించింది. పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ రజామాలిక్‌ఖాన్ కూడా వైద్య పరమైన సాక్ష్యాలను సేకరించారు. వరంగల్ పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి దింపారు. యువతి సహా మరో ఇద్దరు అనుమానితులను వారు విచారిస్తున్నట్టు సమాచారం.
రెండు మొబైళ్లు లభ్యం
ఈ కేసులో తొలుత పోస్టుమార్టం నివేదికే కీలకమని భావించారు. మొదట గురువారం నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలగా, శుక్రవారం మరో అయిదు శవాలు బావి నుంచి బయటపడ్డ విషయం తెలిసిందేే. శనివారం మృతుడు మక్సూద్ కుటుంబీకులకు సంబంధించిన రెండు సెల్‌ఫోన్లు పోలీసులకు దొరికినట్లు సమాచారం. ఘటనా స్థలానికి సమీపంలోని ఇండస్ట్రియల్ కాలనీలో ఇవి పడిపోయి ఉండగా ఓ స్థానికుడు అందులో సిమ్‌కార్డులు వేసుకోగానే పోలీసులు గుర్తించి...ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి మక్సూద్ కుమార్తెదని, మరో ఫోన్ కుమారుడిదని అనుమానిస్తున్నారు. ఈ సెల్‌ఫోన్లలోని కాల్‌డేటా కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక బిహార్‌కు చెందిన యువకుడికి పరిచయమున్న వరంగల్ శివనగర్‌కు చెందిన యువతిని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పాత నేరస్థుల కదలికలపైనా నిఘా పెట్టారు. ఇద్దరు బిహార్ యువకులను సైతం పోలీసులు తమ అదుపులోకి తీసుకొని మృతులు శ్రీరాం, శ్యాం గురించి ఆరా తీస్తున్నారు. వీరితో మక్సూద్ బుధవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. గోదాంను నడిపిస్తున్న భాస్కర్, సంతోష్‌తోపాటు, పలువురు స్థానికులను కూడా విచారిస్తున్నారు.
నిద్ర మాత్రలిచ్చారా? గోనె సంచుల్లో లాక్కెళ్లారా?
విషం ఇచ్చాక వారు అపస్మారక స్థితిలో లేదా మృత్యువాత పడ్డ తర్వాత శరీరాలను గోనె సంచుల్లో ఉంచి లాక్కెళ్లారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మక్సూద్ ఇంటి నుంచి గోదాంపైకి ఎక్కే మెట్లు సుమారు వంద మీటర్ల దూరం ఉంటాయి. మరి శరీరాలను గోనె సంచుల్లో లాక్కెళితే మెట్లపైకి ఎలా తీసుకెళ్లారు? ఈ పని ఒక్కరు చేశారా? కొంత మంది కలిసి చేశారా? అనే అనుమానాలూ ఉన్నాయి. మరోపక్క ముందుగా నిద్ర మాత్రలు ఆహారంలో లేదా కూల్‌డ్రింక్‌లో కలిపి ఉంటారని కూడా పోలీసులు మరో కోణంలో ఆలోచిస్తున్నారు. వారు మత్తులోకి జారుకోగానే బావిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆ దిశగా కూడా ఆరా తీస్తున్నారు. అయితే విసెర నివేదిక వచ్చిన తర్వాతే వీటిపై స్పష్టత వచ్చే అవకాశముంది. మక్సూద్ ఇంట్లో పుట్టినరోజు విందు జరిగినట్టు చెబుతున్నారు. అతని ఇంటి ముందే మృతిచెందిన వారి చెప్పులు కనిపించాయి. అంటే వీరంతా చనిపోయే ముందు మక్సూద్ ఇంట్లోనే ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. బిహార్ యువకులు శ్రీరాం, శ్యాం గదిలో చపాతీలు కూడా కనిపించాయి. విందుకు వెళ్లేవారు చపాతీలు ఎందుకు చేసుకుంటారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో శనివారం వరకు పోలీసులు కేసులో స్పష్టతకు రాలేకపోయారు. కేసులో పలువురిని విచారిస్తుండటంతో అంత్యక్రియలను కూడా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్‌లో మక్సూద్ సోదరులకు స్థానికులు, అధికారులు సమాచారం తెలపగా, వారి మృతదేహాలను తాము తీసుకెళ్లేది లేదని, అయితే గోదాం యజమానిపై కేసు పెడతామని తెలిపినట్టు సమాచారం.