ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తల్లి పాలే బిడ్డకు తొలి రక్షణ - telangana 2021 news

బిడ్డను చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించే అమృతమే.. అమ్మపాలు! అందులోనూ ముర్రుపాల శక్తి బిడ్డకు అందితీర్సాలిన ఔషధం.. ఇవన్నీ కాబోయే అమ్మకు తెలిస్తేనే కదా తన బిడ్డను చిరంజీవిగా మార్చేది...

World Breastfeeding Week
World Breastfeeding Week

By

Published : Aug 1, 2021, 11:35 AM IST

కాన్పు తర్వాత బాలింతల్లో మొదట వచ్చే పాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయి. దీన్నే కొలెస్ట్రమ్‌ అంటాం. పోషకాలు పుష్కలంగా ఉండే ఇది చాలా తక్కువ మొత్తంలోనే అందినా పాపాయి అవసరాలకి సరిపోతుంది. రోజులో ఒకటి నుంచి నాలుగు చెంచాల పాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి చిన్నారి పుట్టిన రెండు నుంచి అయిదు రోజుల వరకు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఆ తర్వాత కొలెస్ట్రమ్‌, సాధారణ పాలు రెండూ కలిసి అందుతాయి. కొలెస్ట్రమ్‌లో రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనో గ్లాబ్యూలిన్‌-ఎ (ఐజీఏ) అనే కారకాలు మెండుగా ఉంటాయి.

పోషకాల పరంగా...

సాధారణ తల్లిపాలతో పోలిస్తే ఈ కొలెస్ట్రమ్‌లో మాంసకృత్తులు ఎక్కువ. కొవ్వు, పిండి పదార్థాలు తక్కువ. దీని నుంచే మేలు చేసే బ్యాక్టీరియా పేగుల్లో వృద్ధి చెందుతుంది. పాపాయి పుట్టిన వెంటనే ఈ పాలు పట్టించాలి. దాంతో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రావు. అలాగే ఈ పాలలో యాంటీబాడీస్‌, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. పాపాయి బయటకు వచ్చాక కావాల్సిన పోషణ, రక్షణ... రెండూ ఈ కొలెస్ట్రమ్‌ నుంచే లభిస్తాయి.

లాభాలు...

నెలలు నిండకముందే పుట్టిన చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీళ్లు త్వరగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చిన్నారులకు కొలెస్ట్రమ్‌ ఇవ్వడం చాలా ముఖ్యం. బుజ్జాయి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికీ, రక్తంలో చక్కెరస్థాయులను క్రమబద్ధీకరించడానికీ, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికీ... ఇలా చిన్నారి శరీరంలోని ప్రతి అవయవ ఆరోగ్యానికి కొలెస్ట్రమ్‌ కావాల్సిందే. ఈ పాలు పట్టించినప్పుడు మాత్రమే చిన్నారి బొజ్జలోని మలం బయటకు సులువుగా వెళ్లిపోతుంది.

పాలు ఎప్పుడు పట్టాలి?

పాపాయి పుట్టిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పాలు పట్టాలి. కాన్పు అయిన గంట లోపు పాపాయికి తల్లిపాలు పట్టించాలి. సిజేరియన్‌ అయిన తల్లులు కూడా ఒకటి నుంచి మూడు గంటల్లో పాలు పట్టాలి. కాబట్టి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ మీరు ఇప్పటి నుంచే సిద్ధమవ్వండి.

ఇదీ చూడండి: Friendship Day: సారీ చెబితే.. కిరీటం కింద పడుతుందా?

ABOUT THE AUTHOR

...view details