ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 6:42 AM IST

ETV Bharat / city

నివర్ తుపాన్ : ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం!

బంగాళాఖాతంలో మరో తుపాను దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రత్యేకించి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

weather
weather

ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా.. మంగళవారం లోపు తుపానుగా మారే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ తుపానుకు ‘నివర్‌’ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును ఇరాన్‌ దేశం సూచించింది. తుపానుగా మారిన తర్వాత ఈనెల 25న తమిళనాడు, పుదుచ్చేరి తీరాన కరైకల్‌, మహాబలిపురం మధ్య తీరం దాటొచ్చన్నది వాతావరణ శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికే అరేబియా సముద్రంలో ‘గతి’ తీవ్ర తుపాను కొనసాగుతోంది. ఇది పశ్చిమ తీరానికి దూరంగా ఉన్నా వర్ష ప్రభావం మాత్రం ఉండనుంది. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో తుపాను దూసుకొస్తోంది.

ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రత్యేకించి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే వర్షాల ప్రభావం ఉందని, రాయలసీమ జిల్లాల్లో మంగళవారం నుంచి, తెలంగాణలో బుధవారం నుంచి వర్షాలు మొదలవనున్నట్లు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదివారం నుంచే హెచ్చరికలు జారీచేశారు. మొత్తంగా ఈ తుపాను ప్రభావం 26వ తేదీ వరకూ ఉండనుంది.

నివర్ తుపాన్ : ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం!

ఇదీ చదవండి:పోలవరం ఏమైనా నిషిద్ధ ప్రాంతమా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details