Muthangi gurukul school: తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపిన విషయం తెల్సిందే. అదే పాఠశాలకు చెందిన మరో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం, సోమవారం నిర్వహించిన కొవిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన 25 మంది బాలికలు వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారిన పడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారు.
ఏం జరిగింది?
gurukul school : పటాన్చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం 42 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. ఒక విద్యార్థికి స్వల్ప లక్షణాలు ఉండటంతో అనుమానంతో పాఠశాలలో వైద్య పరీక్షలు చేపట్టారు. గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 27మంది సిబ్బంది, 491మంది విద్యార్థులు ఉండగా.. ఆదివారం 27 మంది సిబ్బంది, 261మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక ఉపాధ్యాయురాలికి, 42మంది విద్యార్థులకు కరోనా సోకినట్లుగా తేలింది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవి ఆధ్వర్యంలో మిగిలిన వారికి సోమవారం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి నిన్న పరీక్షలు పూర్తయ్యాయి. మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. పాఠశాలలోని మొత్తం 48 మంది బాధితుల్లో ఒక టీచర్, 47 మంది విద్యార్థులు ఉన్నారు.