నదీ జల వివాదాలపై రెండు గంటలపాటు జరిగిన అత్యున్నత మండలి సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు, వాటాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో వివరించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు సహా కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. నదీజలాల పంపిణీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమన్న కేసీఆర్... దేశంలో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైన వాటా పొందే హక్కు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని స్పష్టం చేశారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా, కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సర్కారు కొనసాగించడం బాధాకరమని అన్నారు.
కేంద్రం స్పందించకపోవడం వల్లే
ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కాల్వను ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందని... రాష్ట్ర విభజన జరిగాక కూడా పోతిరెడ్డిపాడును మరింత విస్తరించడాన్ని తీవ్రంగా ఖండించారు. నదీజలాల కేటాయింపు కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే కేంద్రానికి లేఖ రాశామన్న కేసీఆర్.. ఏడాది గడిచినా స్పందించకపోవడం వల్లే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. విభజన చట్టం సెక్షన్ 89 కింద కృష్ణానదీ జలాల వివాద ట్రైబ్యునల్‌కు విధివిధానాలు ఇచ్చి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు. అవసరాలు తీరకుండా బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఏపీకి లేదని.. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏపీకి చేసిన సూచనలను సరైనవిగా అభివర్ణించారు.
967.94 టీఎంసీలకు లోబడే
తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావన్న సీఎం కేసీఆర్.... ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైందని వివరించారు. రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేనని, ఎలాంటి రహస్యం లేదన్న సీఎం... నిర్మాణ క్రమానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నందునే డీపీఆర్‌లు ఇచ్చేందుకు కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందన్నారు. డీపీఆర్‌లు సమర్పించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు. తమ అభ్యంతరాలు, కేంద్రం పంపిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ అక్రమ ప్రాజెక్టు పనులను కొనసాగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పనులను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి షెకావత్‌ను కోరారు. ఏపీ ప్రభుత్వం మొండివైఖరితో క్రమశిక్షణను ఉల్లంఘించి అక్రమ నీటి ప్రాజెక్టుల పనులు కొనసాగిస్తే రైతుల సాగునీటి అవసరాల కోసం బాబ్లీ తరహాలో కృష్ణానదిపై అలంపూర్ - పెద్దమారూర్ వద్ద ఆనకట్ట నిర్మించి తీరతామని వెల్లడించారు.
సంతకాలు తీసుకున్న తర్వాతే
ప్రతిపాదిత ఆనకట్ట ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వస్తే సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. బోర్డులు సమర్ధంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి ఆ తర్వాత వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశ వివరాలను సరిగా నమోదు చేయలేదని.. ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ సమావేశ చర్చ, నిర్ణయాలను వీడియో, రాతపూర్వకంగా నమోదు చేయాలని సూచించారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకున్న తర్వాతే మినట్స్‌ను అధికారికంగా విడుదల చేయాలన్నారు. ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రైబ్యునల్ ఏర్పాటు అంశం తెలంగాణ ఒత్తిడి మేరకు పరిష్కారం కావడం రాష్ట్రానికి మేలు చేకూర్చే అంశమని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఫిర్యాదులు ట్రైబ్యునల్ ద్వారా పరిష్కారమైతే కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్ర వాదనను గట్టిగా వినిపించేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు.
ఇదీ చదవండి:రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం: జగన్