ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుల్ల చేసి.. కొల్లగొట్టి! - anantapuram

ఖనిజం అక్రమ మైనింగ్ తవ్వకాలు అనంతపురం జిల్లాలో జోరందుకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. భూగర్భ మైనింగ్‌ కావడంతో అడ్డు చెప్పేది ఎవరనే ధోరణిలో అక్రమార్కులు వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.

mining
mining

By

Published : Oct 11, 2021, 6:51 AM IST

అనంతపురం జిల్లాలో ఖనిజం అక్రమ తవ్వకాలు హద్దులు దాటుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. భూగర్భ మైనింగ్‌ కావడంతో అడ్డు చెప్పేది ఎవరనే ధోరణిలో అక్రమార్కులు వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎంతమేర తవ్వకాలు జరిగాయని నిర్ధారించే నిపుణులు లేకపోవడం వారికి కలిసివస్తోంది. పరిధికి మించి తవ్వడంతో మైనింగ్‌ సమీపంలోని పొలాల్లో బోరుబావులు పడని పరిస్థితి నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇక్కడ వ్యవసాయం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

తాడిపత్రి గనులశాఖ సహాయ సంచాలకుడి పరిధిలో 3080 హెక్టార్లలో 12 రకాల ఖనిజాలకు సంబంధించి 110 క్వారీలున్నాయి. వీటిలో ప్రధానంగా డోలమైట్‌, స్టీటైట్‌, వైట్‌షెల్‌, రోడ్డు కంకర గనులున్నాయి. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలోని కొండుపల్లి స్టీటైట్‌ భూగర్భగనుల్లో తనిఖీలు చేస్తే టన్నుల కొద్దీ అక్రమాలు బయటపడతాయి. అనుమతులు ఒకచోట తీసుకొని తవ్వకాలు మరోచోట చేస్తున్నారు. పరిమితికి మించి తవ్వేస్తున్నారు.

ఒక టన్నుకు రాయల్టీ చెల్లించి 5టన్నుల వరకు తరలించుకుపోతున్నారు. గనుల్లో పాటించాల్సిన నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.

రాయల్టీలో ఎత్తుగడలు

స్టీటైట్‌ (బలపం) అరుదైన ఖనిజం. కొండుపల్లిలో ప్రస్తుతం 26 భూగర్భ గనులు నడుస్తున్నాయి. మరికొన్నింటికి అనుమతులున్నా ఇంకా మైనింగ్‌ ప్రారంభించలేదు. ఒక్క మెట్రిక్‌ టన్ను స్టీటైట్‌ తరలించాలంటే ప్రభుత్వానికి రాయల్టీ రూ.500, సెకండ్‌ క్వాలిటీ ఖనిజానికి రూ.380 వరకు చెల్లించాలి. చాలామంది యజమానులు రాయల్టీ చెల్లించిన దానికంటే రెట్టింపు ఖనిజాన్ని తరలిస్తున్నారు. మరికొంతమంది తెలివిగా సెకండ్‌ క్వాలిటీ ఖనిజానికి రాయల్టీ చెల్లించి.. మొదటి క్వాలిటీ ఖనిజాన్ని పరిశ్రమలకు తరలిస్తున్నారు. యాడికి మండలం రాయలచెరువులోని స్టీటైట్‌ పరిశ్రమలకు రోజుకు 200 నుంచి 250 టన్నుల వరకు ఖనిజాన్ని తరలిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.1.25 లక్షలు, నెలకు రూ.31 లక్షల ఆదాయం సమకూరాల్సి ఉండగా కేవలం రూ.16 లక్షలలోపే వస్తోంది. అంటే ఏడాదికి రూ.1.80 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. భూగర్భగనుల్లో తవ్వకాలు కొండుపల్లికి వెళ్లే రహదారి కిందికి, పశుగ్రాసం నిల్వ చేసుకునే దొడ్లలోకి చొచ్చుకొచ్చాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:పల్లెల్లో కోతలు.. లోడ్‌ సర్దుబాటు కోసం 2-3 గంటల సరఫరా నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details