ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొక్కకుండానే వెళ్లే సైకిళ్లు.. మనుషులను మోసే డ్రోన్లు.. - IIT Hyderabad designs drones which carries humans

Drones carrying humans : ఇప్పటివరకు రిమోట్‌ ఆధారంగా పనిచేసే డ్రోన్లు మనకు తెలుసు.. అవి చిన్న చిన్న పనులు చేస్తాయని కూడా మనకు తెలుసు.. మరి, అవి మనుషులనూ మోసుకెళ్తే ఎలా ఉంటుంది..? దీంతోపాటు.. తొక్కకుండానే సైకిల్ ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? రైల్వేస్టేషన్‌ లేదా బస్టాపులో దిగిన మీ వద్దకు సైకిల్‌ దానంతట అదే వచ్చి.. కావాల్సిన చోటుకు తీసుకెళితే.. ఇంకెలా ఉంటుంది?? ఇవన్నీ జరిగేలా ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధనలు చేస్తోంది.

Drones carrying humans
డ్రోన్లు

By

Published : Jun 25, 2022, 8:45 AM IST

Drones carrying humans : కేంద్ర శాస్త్రసాంకేతిక విభాగం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలకు కొన్ని ప్రాజెక్టులు ఇచ్చి పరిశోధనలు చేయిస్తోంది. అందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌కు రూ.135 కోట్లు అందించింది. చోదకులు లేకుండా నేలపై, నీటిలో, ఆకాశంలో నడిచే వాహనాలను రూపొందించేలా ఇక్కడ కృషి కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లగలిగే డ్రోన్‌ను వారం రోజుల్లో పరీక్షించేందుకు రంగం సిద్ధమైంది. కొన్నేళ్లుగా ఈ అంశంపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు ఐఐటీ ప్రాంగణంలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. డ్రైవర్‌ అవసరం లేకుండానే జీపీఎస్‌ ఆధారంగా నిర్దేశించిన గమ్యానికి ఈ డ్రోన్‌ మనుషులను తీసుకెళుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఎంపిక చేసిన కొన్ని చోట్ల వీటిని వినియోగించడంపై దృష్టి సారించనున్నారు.

ఆగిన చోటుకు వచ్చే సైకిల్‌:అటానమస్‌ నావిగేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న ఐఐటీ పరిశోధకులు చోదకరహిత సైకిల్‌నూ అందుబాటులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. మనం బస్సు లేదా రైల్వేస్టేషన్‌లో దిగిన తర్వాత సైకిల్‌పై వెళ్లాలనుకుంటే... పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉండే సైకిల్‌ మీ వద్దకు తనంతట తానే వచ్చేస్తుంది. ఎక్కి కూర్చున్న తర్వాత ఎక్కడికి వెళ్లాలో చెబితే చాలు తొక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా మిమ్మల్ని గమ్యానికి చేర్చుతుంది. బ్యాటరీతో నడిచే దీన్ని పరీక్షించేందుకు మరికొంత సమయం పట్టనుంది.

డ్రైవర్‌ లేని వాహనంలో ప్రయాణించనున్న కేంద్రమంత్రి:చోదకుడు లేకుండా ప్రయాణించే వాహనాన్ని ఐఐటీ హైదరాబాద్‌ అభివృద్ధి చేసింది. కేంద్రశాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ జులై 4న ఇక్కడికి రానున్నారు. ఈ వాహనంలో ఆయన ఒక కిలోమీటరు దూరం ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంపస్‌లో ప్రయాణానికి కూడా చోదక రహిత ఈవీలనే ఉపయోగించనున్నారు.

చాలా అంశాల్లో కీలక పరిశోధనలు:"శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుత పరిశోధనలను ఇక్కడ చేస్తున్నాం. వచ్చే పదేళ్లలో చాలా విజయాలు సాధ్యమవుతాయి. యువ ఆచార్యులు, వెయ్యి మందికి పైగా పరిశోధక విద్యార్థులు ఇక్కడ ఉండడం మాకు కలిసొచ్చే అంశం. మెకానికల్‌, డిజైన్‌, ఎలక్ట్రానిక్స్‌.. ఇలా అన్ని విభాగాల సహకారంతో చోదకరహిత వాహనాలు, మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు తయారు చేశాం. వీటిని పరీక్షించేందుకు ఏర్పాట్లు చేశాం. రహదారి సదుపాయాలు లేని చోట, పర్వత ప్రాంతాల్లో, అత్యవసర సమయాల్లో నిర్దేశిత ప్రాంతాలకు మనుషులను తీసుకెళ్లేందుకు ఈ డ్రోన్లు చక్కగా పనికొస్తాయి.."- ఆచార్య బీఎస్‌మూర్తి, డైరెక్టర్‌, ఐఐటీ హైదరాబాద్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details