పెళ్లైన నాటి నుంచి దంపతులు ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులం అవుతామా.. ఎప్పుడెప్పుడు అమ్మా నాన్న అని పిలిపించుకుంటామా అని ఆశగా ఎదురుచుస్తుంటారు. కానీ ఈ ఆశా అందరికీ అంత సులువుగా నెరవేరదు. కొందరు ఏళ్ల తరబడి మాతృత్వ మధురానుభూతి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఇటువంటి వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది దంపతులు ఉన్నారని ఓ అంచనా. వీర్య కణాల్లో సరైన వేగం లేకపోవడం.. వీరికి పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాల్లో ముఖ్యమైనది.
సరికొత్త మూలకం..
ఇటువంటి వారు ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ విధానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఐవీఎఫ్ విధానంలో శుక్రకణాలు.. పిండంతో కలిసి ఫలదీకరణ చెందేలా చేయడానికి పెంటోక్జ్సైఫైలిన్ (Pentoxifylline) అనే రసాయన మూలకాన్ని వినియోగిస్తున్నారు. ఐతే ఈ రసాయనం కొన్ని సందర్భాల్లో పిండంపై చెడు ప్రభావం సైతం చూపుతోంది. అన్నీ సార్లు ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడం లేదు. ఈ సమస్యను గుర్తించిన ఐఐటీ హైదరాబాద్లోని బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ పరిశోధకులు మణిపాల్ విశ్వవిద్యాలయంలోని కస్తూర్బా వైద్య కళాశాల, మంగళూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి ఎంపీటీఎఫ్ అనే మూలకాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు.