Polavaram project: ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమైపోతుందా? ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మళ్లీ మళ్లీ అదే వల్లె వేస్తే ప్రజలు నమ్మేస్తారా? నిజమైన చర్చ, ప్రశ్నించేందుకు ఆస్కారం లేకుండా.. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మనమే గట్టిగా వాదించేస్తే అది రుజువైపోతుందా? సోమవారం శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి విశ్లేషణ ఇలాగే విస్తుగొలిపేలా ఉంది.
‘మీ ఇష్టం వచ్చిన వాళ్లను అడగండి. పార్టీలతో సంబంధం లేకుండా ఏ తటస్థ వ్యక్తినైనా అడిగి చూడండి. పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇలా అయిందో చెబుతారు’ అని జగన్ శాసనసభలో ప్రశ్నించారు. పోలవరం వైఫల్యం మీ ప్రభుత్వానిదేనని ఇప్పటికే తటస్థ కమిటీ తేల్చి చెప్పేసిన విషయాన్ని పక్కన పెట్టేసి మళ్లీ మళ్లీ అదే అవాస్తవం ఎందుకు చెబుతున్నారు?
కేంద్రం నియమించిన హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం మీ ప్రభుత్వ హయాంలోనే 2021 నవంబరులో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై నివేదిక ఇవ్వలేదా? వారు తటస్థ బృందం కాదా? వాళ్లు చెప్పిందేంటి?
‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించేచోట ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు, నదీ గర్భం కోతకు ప్రకృతి ప్రకోపం కారణం కాదు. ఇది పూర్తిగా మానవ వైఫల్యమే. ఎగువ కాఫర్ డ్యాంలో పడ్డ గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణం. అసమర్థ ప్రణాళిక వల్లే ఈ ఉత్పాతం ఏర్పడింది’ అని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల నివేదిక స్పష్టం చేయలేదా? మరి సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్‌లను పూడ్చనిది ఈ ప్రభుత్వం కాదా?
స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కట్టడం వల్లే పోలవరం ఇలా నాశనమయిందని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. ఏ నీటిపారుదల ప్రాజెక్టుకైనా కేంద్ర జలసంఘమే కీలకం. పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన సంస్థలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ. వారి ఆమోదం లేకుండానే ఈ నిర్మాణాలు పాత ప్రభుత్వం చేసిందని నిరూపించగలరా? రికార్డులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. స్పిల్‌వే పూర్తి చేయకముందే ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ కమిటీలు అనుమతులు ఇవ్వలేదు, సంతకాలు చేయలేదు అని ఉంటే ఆ కాగితాలు ప్రదర్శించవచ్చు కదా! స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయకుండా మిగిలినవి నిర్మించడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఇలా అయిందని కేంద్ర జలసంఘం/ పోలవరం అథారిటీ/ డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ పేర్కొన్న కాగితాలు ప్రభుత్వం వద్ద ఏమైనా ఉన్నాయా? ఉంటే శాసనసభలో చూపించొచ్చు కదా..! కానీ పోలవరంలో భారీ విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని నిపుణుల కమిటీలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: