ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

loan apps: రుణ యాప్​లు వేధిస్తున్నాయా.?.. అయితే ఈ సెక్షన్స్ గురించి తెలుసుకోండి.. - రుణం తీసుకోవడం ఎలా

loan apps ఒక్కసారి అప్పు తీసుకుని, వడ్డీ సహా మొత్తం రుణం తీర్చేసినా ఇంకా చెల్లించాల్సి ఉందంటూ వేధింపులు... మార్ఫింగ్‌ చిత్రాలతో మానసిక క్షోభకు గురిచేసేంతగా అకృత్యాలు.. అప్పు తీరుస్తావా? లేదంటే పరువు తీసేయాలా? అనే బెదిరింపులు.. ఇలా ఒకటేమిటి ఆన్‌లైన్‌ రుణయాప్‌ల నిర్వాహకుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. వీరి బారిన పడి పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొందరు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. చాలామంది నిత్యం భయం భయంగా గడుపుతున్నారు.

loan apps
loan apps

By

Published : Sep 19, 2022, 10:01 AM IST

RBI Rules: ఒక్కసారి అప్పు తీసుకుని, వడ్డీ సహా మొత్తం రుణం తీర్చేసినా ఇంకా చెల్లించాల్సి ఉందంటూ వేధింపులు... మార్ఫింగ్‌ చిత్రాలతో మానసిక క్షోభకు గురిచేసేంతగా అకృత్యాలు.. అప్పు తీరుస్తావా? లేదంటే పరువు తీసేయాలా? అనే బెదిరింపులు.. ఇలా ఒకటేమిటి ఆన్‌లైన్‌ రుణయాప్‌ల నిర్వాహకుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. వీరి బారిన పడి పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొందరు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. చాలామంది నిత్యం భయం భయంగా గడుపుతున్నారు. రుణయాప్‌ల నిర్వాహకులు పాల్పడుతున్న ప్రతి చర్యా చట్టరీత్యా నేరమేనని, వారికి భయపడాల్సిన పనిలేదని న్యాయనిపుణులు, పోలీసులు చెబుతున్నారు. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి వారి ఆటకట్టించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణయాప్‌ల నిర్వాహకులు ఎలా వేధిస్తున్నారు? అవి చట్టరీత్యా ఎలా నేరం? ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయొచ్చు? వారికి ఎంత శిక్షపడే అవకాశం ఉంటుందనే అంశాలివీ...

మహిళల పట్ల హేయ ప్రవర్తన

వేధింపుల విధానం-1: మహిళల పట్ల అత్యంత నీచమైన రీతిలో ప్రవర్తిస్తున్నారు. వారి ఫొటోలను నగ్న, అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేసి అందరికీ పంపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. పదేపదే ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.

వర్తించే సెక్షన్లు:ఈ చర్యలన్నీ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడటం అవుతాయి. ఐపీసీ 509, 354 (సీ), 354 (డీ), ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66 (ఈ)ల ప్రకారం ఇలా చేయటం నేరం. రుణయాప్‌ల నిర్వాహకుల నుంచి ఇలాంటి వేధింపులు ఎదురైతే వారిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేయొచ్చు. ఆర్‌బీఐ ఫెయిర్‌ ప్రాక్టీసెస్‌ కోడ్‌, మాస్టర్‌ సర్క్యులర్‌లోని 2ఏ(6) ప్రకారం అధికారుల్ని ఆశ్రయించొచ్చు.

శిక్ష:ఇలాంటి వేధింపులకు పాల్పడేవారికి జరిమానాతో పాటు గరిష్ఠంగా మూడేళ్ల వరకూ జైలుశిక్ష విధించొచ్చు.

పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వేధింపులు

వేధింపుల విధానం-2:‘మేము చెప్పిన సమయంలోగా డబ్బులు కట్టకపోతే.. మీ చిత్రాల్ని అశ్లీలంగా, నగ్నంగా మార్ఫింగ్‌ చేసి వాటిని మీకు తెలిసిన అందరికీ పంపిస్తాం’ అని బెదిరిస్తున్నారు. బాధితుల ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్ల యాక్సెస్‌ పొంది వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పరిచయస్థుల వద్ద వారి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. వారి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారు.

వర్తించే సెక్షన్లు:వ్యాఖ్యలు, సైగలు, చర్యల ద్వారా మహిళ ఆత్మాభిమానానికి విఘాతం కలిగించే ఘటనల కిందకు ఇవి వస్తాయి. ఐపీసీ 509 సెక్షన్‌ ప్రకారం ఇది నేరం. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసు పెట్టాలని కోరాలి. డిజిటల్‌ లావాదేవీల అంబుడ్స్‌మన్‌ పథకం-2019లోని నిబంధనల్ని అనుసరించి ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదుచేయొచ్చు.

శిక్ష:ఇలాంటి వేధింపులకు పాల్పడేవారికి జరిమానాతో పాటు మూడేళ్ల వరకూ జైలుశిక్ష విధించొచ్చు.

నకిలీ పత్రాలు సృష్టించి.. బెదిరింపులు

వేధింపుల విధానం-4:‘మీరు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించనందున మీపై కేసు నమోదుచేశాం. అందుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ ప్రతుల్ని పంపిస్తున్నాం. సీబీఐ, సీఐడీ, ఈడీ, ఆర్‌బీఐల్లో మీపై కేసులు పెట్టాం. కోర్టుల్లోనూ కేసులు వేశాం’ అంటూ నకిలీపత్రాల్ని సృష్టించి వాటిని వాట్సప్‌లో పంపి బెదిరిస్తున్నారు. ఆ పత్రాల్ని రుణగ్రహీత పరిచయస్థులకు పంపించి.. వారి పరువు తీస్తున్నారు.

వర్తించే సెక్షన్లు:ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరిట నకిలీపత్రాలు సృష్టించటం చాలా పెద్దనేరం. ఇది ఫోర్జరీ కిందకు వస్తుంది. ఐపీసీ సెక్షన్‌ 463, 464, 466, 469 సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టాలని స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.

శిక్ష:గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించొచ్చు.

అధిక వడ్డీ వసూలు

వేధింపుల విధానం-5:అధిక వడ్డీ వసూలుచేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఎంత సొమ్ము కడుతున్నా అప్పు ఇంకా తీరలేదంటూ వేధిస్తున్నారు. 32-45% వరకూ వడ్డీని వసూలుచేస్తున్నారు. అసలు కంటే వడ్డీయే ఎక్కువ. దీంతో బాధితులు తీవ్ర వంచనకు గురవుతున్నారు.

వర్తించే సెక్షన్లు:ఈ చర్యలన్నీ మనుషుల్ని దోచుకోవడమే అవుతాయి. ఇది చట్టరీత్యా నేరం. ఐపీసీ సెక్షన్‌ 383, 384తో పాటు అధికవడ్డీ రుణాల చట్టం-1918లోని సెక్షన్‌ 3 ప్రకారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదుచేయొచ్చు.

శిక్ష:గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా లేదా ఆ రెండూ విధించొచ్చు.

నకిలీ యాప్‌లే అసలైనవిగా చలామణీ

మోసం-1:ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు తగిన అనుమతులు లేని వందల రుణయాప్‌లు ప్లేస్టోర్‌లో కొనసాగుతున్నాయి. అవన్నీ ప్రజల్ని వంచించటమే లక్ష్యంగా ఏర్పాటైనవి. తమవి అనుమతి ఉన్న చట్టబద్ధమైన సంస్థలని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని ఉచ్చులోకి లాగి మోసగిస్తున్నాయి.

వర్తించే సెక్షన్లు:ఈ చర్యలన్నీ మోసం, వంచించటం కిందకు వస్తాయి. ఐపీసీ 416, 419, 420, ఐటీ చట్టంలోని 66డీ ప్రకారం ఇది నేరం. వీటిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేసి కేసు నమోదుచేయాలని కోరొచ్చు. ఆయా యాప్‌లను వాటిని ప్లేస్టోర్‌ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయొచ్చు.

శిక్ష:గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష, జరిమానా విధించొచ్చు.

పేమెంటు గేట్‌వే లేకుండా డబ్బుల వసూలు

మోసం-2:ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపు పద్ధతులు లేకుండానే కొన్ని యాప్‌లు కొనసాగుతున్నాయి. వాటికి తగిన పత్రాలు ఉండట్లేదు.
వర్తించే సెక్షన్లు:డిజిటల్‌ లావాదేవీల అంబుడ్స్‌మన్‌ పథకం-2019లోని నాలుగో అధ్యాయం సెక్షన్‌ 8 ప్రకారం, పేమెంట్‌ గేట్‌వే, పేమెంట్‌ అగ్రిగేటర్ల నియంత్రణకు సంబంధించి ఆర్‌బీఐ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం వీటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయొచ్చు.

ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధింపులు, మానసిక క్షోభ

వేధింపుల విధానం-3:రుణయాప్‌ల నిర్వాహకుల వేధింపులు పరాకాష్ఠకు చేరుకోవటంతో తీవ్ర మానసిక క్షోభకు, వేదనకు గురై పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

వర్తించే సెక్షన్లు:ఈ చర్యలన్నీ ఆత్మహత్యకు పురిగొల్పడం కిందకు వస్తాయి. ఇది తీవ్రమైన నేరం. బెయిల్‌ కూడా సులువుగా రాదు. ఐపీసీ సెక్షన్‌ 306 ప్రకారం ఇది నేరం. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసు నమోదుచేయాలని కోరొచ్చు.

శిక్ష:గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించొచ్చు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details