స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిజాయతీని ప్రోత్సహించటంతో పాటు డబ్బు, మద్యం పంపిణీని అరికట్టి అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ తీసుకుంటున్న చర్యలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నిఘా యాప్ను రూపొందించింది. ఈ యాప్ను స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినా... వారిపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఈ యాప్ను తీసుకువచ్చారు.
డౌన్లోడ్ చేద్దామిలా..
గూగుల్ ప్లే స్టోర్లో నిఘా యాప్ అని టైప్ చేసి... యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం తెలుగు, ఆంగ్ల భాషల్లో కావాల్సిన భాషను ఎంచుకుని మొబైల్ నంబరును ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ నంబరును ఎంటర్ చేసిన తరువాత వెరీఫై ఆప్షన్పై క్లిక్ చేయాలి. తరువాత మీ పేరు నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే కెమెరా, వీడియో, ఆడియో సింబళ్లు కనిపిస్తాయి. అనంతరం ఫిర్యాదును నమోదు చేయవచ్చు... పంపవచ్చు.