Aadhar card link with voter card: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 లక్షల ఓట్లు తొలగించాల్సి వస్తుందంటున్నారు తెలంగాణలోని ఎన్నికల అధికారులు. సాధారణంగా ఎక్కడైనా జనాభాలో 70 శాతం మంది ఓటర్లు ఉంటారు. గ్రేటర్ జనాభాలో 90 శాతం మంది ఓటర్లు ఉండడం విశేషం. దీనికి కారణం నగర నివాసితుల్లో అధికులు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం, స్వస్థలంతోపాటు ఇక్కడా ఓట్లు కలిగి ఉండడమే. హైదరాబాద్‌లో అయిదేళ్ల కిందట ఆధార్‌తో ఓటరు కార్డులను అనుసంధానం చేశారు. 15 లక్షల ఓటర్లను తొలగించడం భారీ ఆందోళనకు దారితీయడంతో అంతటితో ఆపేశారు. తాజాగా, అనుసంధాన బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో, గ్రేటర్‌లో పూర్తిస్థాయిలో ఓటరు జాబితా ప్రక్షాళనకు ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు.
భాగ్యనగరంలో పెద్దఎత్తున పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్షలాది మంది ఇక్కడే నివసిస్తూ ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరిలో అధికులకు వారి స్వస్థలాల్లోనూ ఓటు హక్కు ఉంది. ఇదే విధంగా రాష్ట్రంలోని మెదక్, కరీంనగర్, వరంగల్ సహా పలు ఇతర జిల్లాలు వాసులకూ ఉన్నాయి. ఈ పరిణామమే గ్రేటర్‌లో జనాభాలో 90 శాతం మంది ఓటు హక్కు కలిగి ఉండడానికి కారణమైంది. వీరిలో ఎక్కువ మంది ఎన్నికల సమయంలో ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు వెళుతున్నారు. ఫలితంగా హైదరాబాద్‌లో 45 శాతానికి మించి ఓటింగ్ నమోదు కావడం లేదు.
అయిదేళ్ల కిందటే ఈ ప్రయోగం
అయిదేళ్ల కిందట బల్దియా కమిషనర్‌గా సోమేష్ కుమార్ ఉన్న సమయంలో నగరంలో ఓటరు కార్డుతో ఆధార్ నంబరును అనుసంధానం చేశారు. 15 లక్షల మందికి రెండు ఓట్లు ఉన్నట్లు తేలడంతో జాబితా నుంచి తొలగించారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఎన్నికల కమిషన్ విచారణ చేయించింది. అంతటితో అనుసంధాన ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఈ ప్రక్రియలో ఓట్లు కోల్పోయిన వారు మళ్లీ దరఖాస్తు చేస్తే ఓటు హక్కు కల్పించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.