ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆక్సిజన్‌ అనివార్యమైతే.. సముద్ర మార్గంలో తెప్పించే ప్రయత్నాలు! - Andhra Pradesh News

కరోనా వైరస్‌ కేసులకు తగ్గట్లు భవిష్యత్తులో తలెత్తే ప్రాణవాయువు సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్న విషయమై అధికారుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత తీరును చూస్తే.. ఈనెల 15 నాటికి రోజూ సుమారు వెయ్యి టన్నుల వరకు అవసరం కావొచ్చునని అంచనా. ప్రస్తుతం ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి రోజుకి 420-480 టన్నుల వరకు వస్తోంది. కేసులు పెరిగేకొద్దీ..ఆక్సిజన్‌ను అదనంగా సాధించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆక్సిజన్‌
ఆక్సిజన్‌

By

Published : May 5, 2021, 7:12 AM IST

కేంద్ర ప్రభుత్వం గుర్తించి, కేటాయించిన ఉత్పత్తి సంస్థల నుంచి అధికంగా ఆక్సిజన్‌ పొందేందుకు ఉన్న మార్గాలపై అధికారులు దృష్టిపెట్టారు. ఒడిశా, బళ్లారి, విశాఖల నుంచి ప్రస్తుత కేటాయింపుల కంటే ఎక్కువగా వచ్చేలా చూడాలని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తిచేస్తున్నారు. తమిళనాడులో కేసులు తగ్గితే శ్రీపెరంబుదూరు నుంచి అదనంగా ఆక్సిజన్‌ రప్పించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అనివార్యమైతే..ఓ దేశం నుంచి సముద్రమార్గం ద్వారా ఆక్సిజన్‌ తెప్పించే విషయాన్నీ పరిశీలిస్తున్నారు. దీనికి కనీసం 4 రోజులు పడుతుందని అంచనా.

రాష్ట్రవ్యాప్తంగా 53 ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. దీనివల్ల రోజుకి వంద మందికి 20 లీటర్ల చొప్పున ఇవ్వొచ్చునని పేర్కొంటున్నారు. ఆసుపత్రుల్లో పడకలకు కొరత ఏర్పడినందున కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలకూ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను సమకూరుస్తున్నారు. కిందటేడు ఆక్సిజన్‌ సరఫరా కోసం ఏర్పాటుచేసిన పైపుల సామర్థ్యం ఇప్పుడు సరిపోవడంలేదు. వీటిని కొన్నిచోట్ల మార్చేందుకు, సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్యాంకర్లు కూడా అదనంగా అవసరమవుతాయి.

నాడు గరిష్ఠంగా 260 టన్నులు...

కిందటేడు గరిష్ఠంగా రోజుకు 260 టన్నుల వరకు ఆక్సిజన్‌ వాడారు. సెప్టెంబరులో ఈ అవసరం వచ్చింది. ఈ సారి సాధారణ పకడలు ఖాళీగా ఉంటుండగా...ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు నిండిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా ఉన్న 43,916 పడకలకు 28,542 (64.99%) నిండాయి. ఐసీయూలో 76.48%, ఆక్సిజన్‌ పడకలపై 75.23%మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రానికి 625 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందిస్తున్నారు. వీటన్నింటిలో కలిపి 46,914 పడకలు ఉంటే...15,371 మాత్రమే ఖాళీగా ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో 1,078 ఐసీయూ పడకలకు 938 నిండాయి. 3,089 ఆక్సిజన్‌ పడకలు ఉంటే 2,518 మంది వైరస్‌ బాధితులు ఉన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 221కి 16, 765కు 44 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. 95 సాధారణ పడకలకు అన్నీ భర్తీ అయ్యాయి. ఎన్నారై ఆసుపత్రిలో సాధారణ పడకలు 36 మినహా మిగిలినవి ఖాళీ లేవు.

విజయవాడ జీజీహెచ్‌లో ఒక ఐసీయూ పడకా ఖాళీగా లేదు. 100 ఆక్సిజన్‌, 140 జనరల్‌ పడకలు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తున్నా...వాస్తవంలో అన్నీ లేవు. పిన్నమనేని ఆసుపత్రిలో 14 ఐసీయూ, 14 ఆక్సిజన్‌, 117 సాధారణ పడకలు ఖాళీగా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా రియల్‌టైమ్‌లో పడకల ఖాళీలు, భర్తీల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడంలేదు.

ఇదీ చదవండీ... మళ్లీ.. 'అనంత'లో మృత్యుఘోష.. ఆక్సిజన్ అందక నలుగురు మృతి!

ABOUT THE AUTHOR

...view details