రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావుతో ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్(సీవోపీ) అందచేస్తున్నట్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తెలిపారు. బుధవారం గుంటూరులో తొలి విడత గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.శివనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నకిలీ న్యాయవాదులను గుర్తించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా 31 వేల మంది న్యాయవాదులు దరఖాస్తు చేయగా వారికి సీవోపీ, గుర్తింపు కార్డులు సిద్ధం చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో త్వరలో ఈ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు.
దీనివల్ల ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు చాలా మేలు జరుగుతుందని, రాష్ట్రం విడిపోయినప్పుడు సుమారు 60 వేల మంది న్యాయవాదులు ఏపీ రాష్ట్ర పరిధిలోకి వచ్చారని, ప్రస్తుతం 31 వేల మంది రాష్ట్ర బార్ కౌన్సిల్ పరిధిలో నమోదై ఉన్నారని తెలిపారు. లానేస్తం లాంటి పథకాలతో పాటు కరోనా కాలంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న లాయర్లకు 20వేల రూపాయల వరకు లోన్,హెల్త్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు . ప్రభుత్వం మొదటి విడత 25 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు.
ఇటీవల కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో న్యాయవాదులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, బార్ కౌన్సిల్ తరఫున రూ.5.5 కోట్ల సంక్షేమ నిధిని అందచేశామన్నారు. సుప్రీంకోర్టు బెంచ్ సదరన్ ప్రాంతం లో ఏర్పాటు చేయాలని సదరన్ బార్ కౌన్సిల్స్ ప్రతిపాదించినట్లు కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సోమసాని బ్రహ్మానందరెడ్డి, రోళ్ల మాధవితో పాటు స్థానిక బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:15 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్