ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా పెన్నా సిమెంట్స్‌లో తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

jagan piracy case
జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌

By

Published : Nov 29, 2020, 7:54 AM IST

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా పెన్నా సిమెంట్స్‌లో తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పెన్నా కేసులో సీబీఐ దాఖలు చేసిన అదనపు అభియోగపత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటూ సీబీఐ కోర్టు జనవరి 10న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. పెన్నా సిమెంట్స్‌కు భూమి లీజు కేటాయింపుతో పాటు.. హైదరాబాద్‌లో హోటల్‌ నిర్మాణంలో రాయితీలను అప్పటి వైఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో పెన్నా గ్రూపు రూ.68 కోట్ల పెట్టుబడులు పెట్టడంపై సీబీఐ 2013లో అభియోగపత్రం దాఖలు చేసింది. ఇందులో కొందరు మాజీ మంత్రులు, మాజీ ఐఏఎస్‌ శామ్యూల్‌, ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి తదితరులను నిందితులుగా చేర్చుతూ అదనపు అభియోగపత్రాన్ని 2016లో దాఖలు చేసింది.

ఈ అదనపు అభియోగపత్రాన్ని ఈ ఏడాది జనవరిలో సీబీఐ కోర్టు విచారణకు తీసుకుంది. ఒకసారి దర్యాప్తు పూర్తయ్యాక తిరిగి అదనపు అభియోగపత్రం దాఖలు చేయడం చట్టవిరుద్ధమని శ్రీలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను అధికారిక విధులనే నిర్వహించానని, సీబీఐ తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించిందన్నారు. అందువల్ల అదనపు అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సీబీఐ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details